హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చి ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆటోలో వచ్చారు. అయితే పోలీసులు ఆ ఆటోను అసెంబ్లీ గేటు వద్ద నిలిపివేశారు. ఆటోకు లోపలికి ప్రవేశం లేదని, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాలని అసెంబ్లీ సిబ్బంది, పోలీసులు సూచించారు.
తాను అసెంబ్లీ సభ్యుడినని, ఏ వాహనంలోనైనా వచ్చే అధికారం ఉన్నదని, పోలీసులు ఏ విధంగా అడ్డుకుంటారని ప్రశ్నించారు. పోలీసులు ఆటోను పక్కకు పంపించారు. అయినా మరోసారి యూటర్న్ తీసుకొని వచ్చినా కూడా పోలీసులు అనుమతించలేదు. దీంతో కౌశిక్ రెడ్డి నడుచుకుంటూ లోపలికి వెళ్లారు.