హైదరాబాద్ సిటీబ్యూరో/కొండాపూర్, జూన్ 5, (నమస్తే తెలంగాణ): తనకు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను కలిచి వేసింది.. ఆ ప్రాంతపు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఒత్తిళ్లను తట్టుకోలేకే అత్మహత్య చేసుకోసుకున్నాడన్న దుఃఖభారంతోనే ఎమ్మెల్యే అస్వస్థతకు గురయ్యారు.. అని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ తెలిపారు. గురువారం తీవ్ర అస్వస్థతకు గురై మాగంటి గోపీనాథ్ ఏఐజీలో చేరారన్న సమాచారం తెలియగానే మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి దవాఖానకు వెళ్లారు.
అక్కడి వైద్యులను అడిగి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని, 48 గంటల అనంతరం ఆయన ఆరోగ్యంగా బయటకొస్తారని తెలిపారు. మాగంటి గోపీనాథ్ ఈ పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కారణమని, అతని ఒత్తిళ్లు తట్టుకోలేకే బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు, బోరబండ డివిజన్ నేత సర్దార్ అత్మహత్య చేసుకున్నాడని, తన కుడిభుజంలాంటి సర్దార్ మరణం గోపీనాథ్‌ను కుంగదీసిందని చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచి ఎమ్మెల్యే నిద్రాహారాలు మాని, సర్దార్ గురించే ఆలోచించేవారని వారి కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు.
సర్దార్ మరణానికి కారణమైన బాబా ఫసీయుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఇతర నేతలకు చెప్పుకొని గోపీనాథ్ బాధపడ్డారని శ్రవణ్ వెల్లడించారు. సర్దార్ మరణంతో గోపీనాథ్ మానసిక ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిందితుడైన వ్యక్తి పాల్గొన్నాడనే అంశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు లేవనెత్తినప్పుడు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్‌కు మద్దతుగా నిలిచారని దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ అయింది కానీ, చార్జిషీట్ ఫైల్ చేయలేదు కదా అంటూ రఘునందన్‌రావు వ్యాఖ్యానించడం, నిందితుడికి మద్దతు తెలిపిన తీరును చూసి గోపీనాథ్ మరింత మనోవేదనకు గురయ్యారని చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యంతో బయటకు రావాలని కోరుతూ పూజలు నిర్వహించాలని నియోజకవర్గ ప్రజలను దాసోజు శ్రవణ్ సూచించారు.