KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఈ కేసు గురించి మీరు మరిచిపోండి.. ఈ కేసు మీద కొట్లాడుతా మంచి లాయర్లు ఉన్నారు.. జోర్దార్ లీగల్ సెల్ ఉంది. మనం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా నిలబడాలి. మోసపూరిత కాంగ్రెస్ భరతం పట్టే విధంగా ముందుకు పోదాం.
మోసపూరిత హామీలతో రైతుల గొంతు కోసిన దాని గురించి కొట్లాడుదాం.. ఉద్యోగస్తులకు రైతుబంధు కట్ చేస్తున్నావ్.. వారు రైతు బిడ్డలు కాదా..? రైతు రుణమాఫీ అసంపూర్తిగా అయింది. ఏఎస్ఐ సాధిక్ అలీ.. పదవీ విరమణ పొంది 8 నెలలు అవుతున్నా పెన్షన్ వస్తలేదని బాధపడుతున్నాడు. చచ్చి పోతున్నా అని వీడియో పెట్టిండు. ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు చేసింది లేదు.. అప్పులు అప్పులు అని తప్పుడు కూతలు కూసిండు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.
మేడిగడ్డకు పర్రె పడ్డది అన్నాడు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ ఇవాళ భూకంపం వస్తే తట్టుకుని నిలబడ్దది. 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే కూడా తట్టుకుని నిలబడ్దది. ఇవాళ పడ్డది పర్రె మేడిగడ్డకు కాదు.. నీ పుర్రెకు పడ్డది. నీకు బుద్ది లేదు.. ప్రభుత్వం నడపడం చేతనైత లేదు. దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్లు ఇచ్చే తెలివి లేదు. కోదాడ, సూర్యాపేట, డోర్నకల్, తుంగతుర్తికి నీళ్లు ఇవ్వలేదని మాట్లాడుదాం.. ఈ కేసు గురించి ఆందోళన వద్దు.. బ్రహ్మాండంగా కొట్లాడుదాం.. సుప్రీంకోర్టుకు కూడా వెళ్దాం. ఇంకో కోర్టుకు పోదాం. మనం తప్పు చేయలేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బరాబర్ న్యాయ పోరాటం చేద్దాం. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకు, తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసేందుకు ప్రయత్నం చేశాం. అరపైసా కూడా అవినీతి లేదు. ఎవరు ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం పోరాటం చేయాల్సింది.. రైతుభరోసా, పెన్షన్లు, తులం బంగారం, స్కూటీల కోసం పోరాటం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఏసీబీ విచారణ.. కేటీఆర్‌తోపాటు లాయర్‌ను తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
KTR | రాష్ట్రంలో త్రీడీ పాలన నడుస్తోంది.. రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
KTR | అదో లొట్టపీస్ కేసు.. వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు