KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి తన బావమరిది కంపెనీ (శోధ) రూ.1,137 కోట్లు టెండర్ కట్టబెట్టింది ముమ్మాటికీ నిజమేనని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. బావమరిదితో లీగల్ నోటీసు పంపితే ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడటం బంద్ చేస్తా అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. సీఎం చట్టాన్ని ఉల్లంఘించారని, శోధ అనే కంపెనీ గత రెండేండ్లుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన చిన్న కంపెనీ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్లాగా నువ్వు దొరికావు.. రాజీనామా తప్పదు. ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే’ అని కేటీఆర్ హెచ్చరించారు.
రూ.1.50 లక్షల కోట్ల సీఎం ధనదాహానికి లక్షల జీవితాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘గూడు చెదిరి, గుండెపగులుతున్న ఆడబిడ్డల రోదనలు మంచిది కాదు మిస్టర్ చీప్ మినిస్టర్’ అని ఆయన హెచ్చరించారు. ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చిన ఇంటిని కూలుస్తరేమోనని ఆత్మహత్య చేసుకున్న తల్లి, భార్య కడుపుతో ఉంది కనికరించరా! అని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న భర్త శాపనార్థాలు ఎవరికి తగులుతాయో ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. ‘మహానగర ప్రజలారా మీరు అధైర్యపడొద్దు, జరుగుతున్న విధ్వంసంతో తొందరపడి ప్రాణాలను బలి తీసుకోవద్దు, న్యాయ స్థానాలున్నాయి. మీకు మద్దతుగా బీఆర్ఎస్ ఉన్నది’ అని కేటీఆర్ భరోసాను ఇచ్చారు.
నగరంలో నేడు, రేపు కేటీఆర్ పర్యటన
హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరుసగా సోమ, మంగళవారాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ‘72 గంటల తర్వాత సాధారణస్థితికి వచ్చాను’ అని ఆయన పేర్కొన్నారు.