KTR | హైదరాబాద్ : శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఓ ప్రయివేటు వ్యక్తితో నీ బిడ్డనో, నీ భార్యనో ఇష్టమొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊరుకుంటావా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఏమైనా స్వాత్రంత్య ఉద్యమం చేసి జైలుకు పోయిండా..? ఏం చేసి పోయిండు ఆయన జైలుకు..? సానుభూతి ఎందుకు..? మేం పోలేదా జైలుకు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైలుకు నేను కూడా పోయాను. బరాబర్ అక్కడ ఉన్నాం అని కేటీఆర్ తెలిపారు.
నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదికి ప్రయివేటోడు డ్రోన్ పంపితే ఊరుకుంటావా..? అక్కడ నీ బిడ్డనో, నీ వైఫో ఉంటే వాడు ఇష్టమొచ్చినట్టు ఫొటోలు తీస్తే ఊకుంటావా..? ఎవని ఇండ్లల అంటే వాని ఇండ్ల జొరబడుతా.. నా ఇష్టమున్నట్టు చేస్తా.. అరాచకం చేస్తా అంటే ఊకుంటావా..? ఇది పద్ధతేనా.. మీ కాడికి వచ్చే వరకే కుటుంబాలు, భార్యాపిల్లలు. వేరే వాళ్లకు భార్యాపిల్లలు లేరా..? మీరు ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు.. ఆ రోజులు నీతులు లేవా..? చివరకు మా ఇంట్లో పిల్లలను తిట్టింది మీరు కాదా..? మా ఇంట్లో మైనర్ పిల్లలను పట్టుకుని బూతులు మాట్లాడింది మీరు కాదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అసలు జైలుకు ఎవరు పంపుతారు..? ప్రభుత్వాలు పంపుతాయా..? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేశారు రిమాండ్కు పంపొద్దని. కాదు మీరు జైలుకే పోవాలని కోర్టు చెప్పింది. మేం ఏం చేస్తాం దానికి. రిమాండ్కు పంపేది మీరు కాదు మేం కాదు. ఇక ముఖ్యమంత్రి హుంకరిస్తున్నారు.. నేను అనుకుంటే మీరు ఎవరు అక్కడ మిగలరని. నువ్వు ఏం అనుకున్నా ఫరక్ పడదు. నువ్వేం చేసుకున్న ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి అధికారం శాశ్వతం అని.. కానీ ఏది శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. కోర్టుకు మాత్రమే ఉంటాయి. గోవిందా సినిమా పాత్ర సీఎంకే సూట్ అవుతుంది. అప్పుడే సీఎం, స్పీకర్, కోర్టు అయిపోతారు.. బహు పాత్రలు మీకే సాధ్యమవుతాయని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.