KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎన్నారైలు వచ్చి ఎమ్మెల్యేలు అయ్యారని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
సీఎం మర్యాదకరంగా మాట్లాడుతారని అనుకున్నాను. కొన్ని ఊహించలేం.. ఎందుకంటే అది కొంతమందికి సాధ్యం కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్ అని ఏకవచనంతో మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించిన వారిని పట్టుకుని గారు గారు అని మాట్లాడినప్పుడే వారి సంస్కారం, పరిజ్ఞానం అర్థమైంది. అచ్చొసిన ఆంబోతు ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఎవరు అచ్చొసిన ఆంబోతు. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. కాంగ్రెస్ పార్టీలో మా భట్టన్నా.. శ్రీధరన్నా.. దామోదరన్నా, ప్రభాకరన్నా, ఉత్తమన్నా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డన్నా.. వీరంతా కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన.. చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎన్నారైలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని సీఎం అన్నారు. మరి ఎన్నారైలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరు..? అని కేటీఆర్ నిలదీశారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దామోదర రాజనర్సింహా స్పందించారు. కేటీఆర్ ప్రసంగానికి అడ్డుపడిన ఆయన.. పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేం హైకమాండ్‌కు అప్పజెప్పుతాం. హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి శిరసావహిస్తాం. అది మేం పాటిస్తాం అని దామోదర రాజనర్సింహ చెప్పారు.
మళ్లీ కేటీఆర్ మాట్లాడుతూ.. మేం చెప్పింది అదే.. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు.. ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అని చెప్పాను. మీరు చెప్పిందే తాను చెప్పానని కేటీఆర్ అన్నారు. ఎన్నారైల పట్ల సీఎంకు ఉన్న ప్రేమను ఎన్నారైలు గమనించాలి అని కోరుతున్నా. వందల కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం వాళ్లను తీసుకొచ్చి అధ్యక్షులను చేసుకున్నది ఎవరు..? ఈ దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నారైల గురించి మాట్లాడితే ఎట్ల..? అని కేటీఆర్ విమర్శించారు.