హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా బౌరంపేట ప్రాథమిక సహకార సంఘంలో రుణాలు తీసుకున్న వారిలో 11 మందికి మాత్రమే మా ఫీ అయ్యాయని స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటంలేదని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీపై రేవంత్ దేవుళ్లపై ఒట్టు వేసి వాటిని నిలుపుకోవడానికి తంటాలు పడుతున్నారని ఎద్దే వా చేశారు. పైసాపైసా కూడబెట్టాం, నిద్రలేని రాత్రులు రుణమాఫీ కోసం గడిపామంటున్న సీఎం.. అంత కష్టపడి కూడబెడితే రూ.వంద కోట్లు ప్రకటనలకు ఎం దుకు ఖర్చు పెట్టారని నిలదీశారు.
ప్రతిపక్షంలో ఉండగా ప్రకటనల కోసం వృథాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఆరోపించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్న డబ్బు రేవంత్ తాతదా? అని మండిపడ్డారు. బౌరంపేట ప్రాథమిక సొసైటీలో 632 మంది సభ్యులు ఉంటే, అం దులో 500 మంది వరకు రూ.లక్ష లోపు రుణమాఫీకి అర్హులని, కానీ, 11 మందికే మాఫీ అయిందని వివరించారు. దూలపల్లి పీఏసీఎస్ కూడా చాలా తకువ మందికే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం అందరికీ రుణమాఫీ చేసినట్టుగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రైతులు కాంగ్రెస్‌ను వదిలిపెట్టరని, ముం దుంది కాంగ్రెస్‌కు మొసళ్ల పండగ అని హెచ్చరించారు.
ఆరోగ్యంతో రాజకీయమా: కోవ లక్ష్మి
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఒక పైసా రాలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం ఇతర పార్టీలకు ఒక న్యాయం అన్నట్టుగా ఉన్నదని విమర్శించారు. సీఎంఆర్ఎఫ్ విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలోనూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిలాగా వ్యవహరించాలి తప్ప పీసీసీ అధ్యక్షుడిగా కాదని సూచించారు. కేసీఆర్ హాయంలో ఎమ్మెల్యేలందరినీ ఒకేలా చూ శారని గుర్తుచేశారు. రైతుభరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నదని ఆరోపించారు.