KP Vivekananda | హైదరాబాద్ : తూతూ మంత్రంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి సీఎం కేరళ పర్యటనకు వెళ్లడం.. వారికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఏ బిల్లులు పెడతారో స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో వరదలతో, యూరియా కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక మీద సాయంత్రం చర్చ ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం మీద చర్చ పెడతామంటున్నారు. ఖర్చుతో కూడుకున్న అసెంబ్లీ సమావేశాలను పట్టించుకోకుండా సీఎం కేరళకు వెళ్లారు. పుస్తక ఆవిష్కరణ కోసం ఫ్లైట్ బుక్ చేసుకొని మరి సీఎం కేరళకు వెళ్లారు అని కేపీ వివేకానంద మండిపడ్డారు.
కేసీఆర్ వల్లే బీసీ రిజర్వేషన్ ఆగిపోయిందని నిందలు వేశారు. ఇప్పుడు కాళేశ్వరం మీద నిందలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తూతూ మంత్రంగా సమావేశాలను నడుపుతున్నారు. హైకోర్టు మొట్టి కాయలు వేసిన తరువాతే కాళేశ్వరం కమిషన్ నివేదికను సభ్యులకు ఇచ్చారు. ఇరిగేషన్ మినిష్టర్ వారి మంత్రులకు ఎమ్మెల్యేలకు నిన్న ట్రైనింగ్ ఇచ్చి బీఆర్ఎస్ను ఎలా ఎదుర్కోవాలో ట్రైనింగ్ ఇచ్చారు. మాకు మాత్రం 665 పేజీల నివేదికను చూసే సమయం లేకుండా చేశారు. నిన్న రాత్రి వరకు ఎజెండా చెప్పకుండా డిలే చేశారని కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వరద కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో మేమంతా అసెంబ్లీకి వచ్చాము. ఇలాంటి సమయంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రక్కన పెట్టి కేరళ వెళ్ళాడు. డిల్లీలో హై కమాండ్‌కు భజన చేయడం, కుర్చీ కాపాడుకోవడం తప్పా రాష్ట్ర ప్రయోజనాలు అయనకు పట్టడం లేదు. ఏదో ఉదయం వచ్చి బీసీ బిల్లుపై మాట్లాడి.. స్పెషల్ ఫ్లైట్‌లో కేరళ వెళ్ళాడు. ఇప్పటికే తెలంగాణ అప్పుల పాలైందనీ.., ఒక్కో పైసా ఆదా చేస్తూ రాష్ట్రాని కాపాడుతున్నా అన్నాడు. కానీ ఇంత ఖర్చుతో అసెంబ్లీ జరుగుతుంటే అత్యంత ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్‌లో ఎలా వెళ్ళాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షతో పీసీ ఘోష్ రిపోర్ట్‌పై చర్చ పెట్టారు. పీసీ ఘోష్ కమిషన్ కేవలం కాంగ్రెస్ కమిషన్ మాత్రమే. కాళేశ్వరం నీటిని వాడుకుంటూ.. కాళేశ్వరం విఫల ప్రయత్నం అని అంటున్నారు. కోర్టు ఆదేశించిన తర్వాతే.. కమిషన్ రిపోర్ట్ పెన్ డ్రైవ్‌లో ఇచ్చారు. 665 పేజీల రిపోర్ట్ పొద్దున ఇచ్చి.. మధ్యాహ్నం మాట్లాడాలన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్బుద్ధి. వాళ్ల మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముందే పవర్ పాయింట్ ప్రెజెంటెషన్ ఇచ్చే ప్రిపేర్ చేశారు. ప్రజలు రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. మమ్మల్ని ఇక్కడ కట్టి పడేశాడు. వాళ్ల సొంత పార్టీ ఎమ్మెల్యేనే ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉందని సభకి రానాని చెప్పాడు. అధికారం ఉందని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడు అని రేవంత్‌పై కేపీ ధ్వజమెత్తారు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం వస్తూ పోతూ ఉంటది. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు. ఇంకా కొన్ని రోజులు సభ నడపాలని డిమాండ్ చేస్తుంటే పట్టించుకోవడం లేదు. యూరియాపై చర్చ చేద్దామంటే స్పందన లేదు. పవర్ పాయింట్ ప్రెజెంటెషన్కు అవకాశం అడిగితే ఇవ్వడం లేదు. సభ్యులందరూ పనులు పక్కన పెట్టీ సభకు వస్తే.. ముఖ్యమంత్రి గాలికి తిరగడం సబబు కాదు.. ఇప్పటి నుండి ఎప్పుడూ సభ పెట్టాలంటే.. అప్పుడు సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. ఎంత ఆలస్యం అయినా కూడా మా సభ్యులు ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందని కేపీ వివేకానంద గౌడ్ పేర్కొన్నారు.