MLA Kova Laxmi | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన ఆదీవాసీలపై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను గిరిజన ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. సీఎం చెబుతున్న 24 గంటల కరెంటు వట్టి బోగస్‌గా మారింది. గ్రామాల్లోకి వెళితే కరెంటు పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. రుణమాఫీ సరిగ్గా జరగలేదు. రైతు భరోసా ఇంకా పూర్తి చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు. తులం బంగారం ఏమైంది? పెన్షన్లను పెంచుతామని ఎందుకు పెంచలేదు? కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేశారు? అని కోవ లక్ష్మి నిలదీశారు.
అన్ని వర్గాలను మోసం చేశారు. అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలే ముందుకు వచ్చి రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ఇంద్రవెల్లిలో 1981లో ఆదివాసీలను పొట్టన పెట్టుకుంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. గిరిజన, ఆదివాసీలకు ఏదైనా మేలు జరిగింది అంటే అది కేసీఆర్ ప్రభుత్వంలోనే. కొమురం భీం పేరిట జిల్లాను ఏర్పాటు చేసింది కేసీఆరే. బంజారా భవన్, ఆదివాసీ భవన్లను కేసీఆర్ హయాంలోనే నిర్మించాo. ఆదివాసీ, గిరిజన సంస్కృతికి ఆదరణ కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వమే. సీఎం లేని పోని మాటలు మాట్లాడితే గిరిజన ఆదివాసీలు నమ్మే పరిస్థితి లేదు. గిరి వికాసం పేరును మార్చి తానే ఏదో చేశానని రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో గిరిజన ఆదివాసీలకు ఇచ్చిన పట్టాలనే రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. చేతనైతే కొత్తగా ఇవ్వండి. ఆదివాసీ గూడేలు, గిరిజన తండాల్లో రోడ్లు పాడైతే బాగు చేసే పరిస్థితి లేదు. సీఎం అబద్దపు మాటలు మానుకోవాలి అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు.