MLA Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల చెరువులను, రోడ్లను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. గత రెండు రోజుల నుండి విస్తృతంగా వర్షాలు పడడంతో వాగులు, వంకలు, చెరువులు అలుగులు దుంకుతున్నాయి. రోడ్లపై నుండి వర్షం నీరు ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోడ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని మత్స్యకారులకు తెలిపారు. రెండు రోజులపాటు మత్స్యకారులు కూడా బయటకు వెళ్ళరాదని సూచించారు. ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, కాలువలు పొంగిపొర్లే ప్రమాదముంది. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.