MLA Jagadish Reddy | సూర్యాపేట : మళ్లీ కేసీఆర్ వస్తాడు.. కాళేశ్వరం నీరు రైతులకు అందిస్తారని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం నివేదిక, ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నాపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
అది కాళేశ్వరం కమీషన్ రిపోర్ట్ కాదు.. కాంగ్రెస్, బీజేపీల ఆరోపణల చిట్టా అని విమర్శించారు. అసలు కమీషన్ రిపోర్ట్ తొక్కిపెట్టి కాంగ్రెస్ సొంత కథలు అల్లుతోంది. కాళేశ్వరమే తెలంగాణాకు జీవ ధార. మళ్ళీ కేసీఆర్ వస్తాడు కాళేశ్వరం నీరు అందిస్తారు. మోదీ, చంద్రబాబు డైరెక్షన్లో కేసీఆర్‌ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం నివేదిక పేరుతో కాంగ్రెస్ మోసపూరిత ప్రచారం చేస్తోంది. కాళేశ్వరం నీళ్ళ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పోరాటానికి సిద్ధమౌతున్నారు. బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. కాళేశ్వరం కుట్రలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.
అరెస్టులు ఉండొచ్చని చిల్లర ప్రచారం చేస్తున్నారు.. ఈ బెదిరింపులకు భయపడేది లేదు. స్థానిక ఎన్నికల్లో లబ్ది కోసమే కాంగ్రెస్ చిల్లర ప్రయత్నం చేస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్‌తో విషప్రచారం చేసి మరోసారి ప్రజల్ని మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తుంది. బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఓట్లు వేయించుకుని జంతరమంతర్ వద్ద ధర్నా పేరుతో కాంగ్రెస్ పార్టీ వేషాలు వేస్తుంది. అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమై కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆడుతుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.