హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ‘సీతారామ ప్రాజెక్టుపై హరీశ్‌రావు అన్న మాటల్లో తప్పేమున్నది?, ఉన్నమాటంటే ఉలుకెందుకు? ఓ మంత్రి కంటతడి పెట్టడం ఎందుకు?.. హరీశ్ మాట్లాడిన దాంట్లో అభ్యంతరక పదాలు ఏమున్నయ్?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. సీతారామ సహా అన్ని అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ఒక్క లేఖయినా రాసిందా? అంటూ నిలదీశారు. బుధవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, తుంగ బాలుతో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, కిరణ్ కుమార్రెడ్డికంటే బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే సీతారామ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, కనీసం బటన్ నొకేప్పుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పాలని మంత్రులను కోరామని తెలిపారు.
‘గురుకులాల్లో పరిస్థితులకు కూడా కేసీఆర్ కారణమని భట్టి అంటున్నారు.. ఇంతకన్నా దారుణం ఉంటుందా?, రోజూ మీరు పళ్లు తోముకోకుంటే కూడా కేసీఆర్‌దే బాధ్యతనా?’ అంటూ ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా ఇంకా బీఆర్ఎస్ మీదే ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నదని, ఇప్పటి కోసం తొమ్మిది నెలల కిందే వండిపెట్టాల్సి ఉండేనా? అంటూ దుయ్యబట్టారు. ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరుసగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే ఈ అనుమతులు వచ్చాయని, కాంగ్రెస్ వచ్చాక సీతారామ సహా ఏ ప్రాజెక్టుకోసమైనా కేంద్రానికి ఒక్క ఉత్తరమైనా రాసిందా? అని నిలదీశారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తప్పటడుగు వేసి బీఆర్ఎస్ ఒత్తిడితో వెనకి తగ్గారని, కాంగ్రెస్ హయాంలో లాగా కేసీఆర్ పాలనలో ఏ ప్రాజెక్టు అంచనాలను కూడా పది, పదిహేను రెట్లు పెంచలేదని గుర్తుచేశారు. కమీషన్లు ఇవ్వడం, తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటని, కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పదహారు చోట్ల కొబ్బరికాయలు కొట్టినా పనులు జరిగాయా? అంటూ నిలదీశారు. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని, కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్సార్ భజన చేస్తున్నారని దుయ్యబట్టారు. వాళ్లిద్దరూ తెలంగాణలో ఒక ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఆంధ్రా, రాయల సీమ ప్రాజెక్టులు పూర్తయ్యాయని, తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయని, రాయలసీమకు 350 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టులను పూర్తి చేశారని, తెలంగాణకు ఏం చేశారని, వైఎస్, చంద్రబాబు హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెకుల సామర్థ్యం ఉన్న ఒక్క చెరువునైనా కట్టారా? అంటూ నిలదీశారు.
‘ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యాయో చర్చించేందుకు ఉత్తమ్ గాని, భట్టి గాని వస్తారా? వారు ఎక్కడికి రమ్మన్నా మేం సిద్ధం’ అంటూ సవాల్ విసిరారు. నీళ్లిస్తే వడ్లు పండుతాయని, వడ్లు పండితే ఎకడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదని విమర్శించారు . తెలంగాణ పాలిట ద్రోహులెవరో, దొంగలెవరో తేలాల్సిందేనని చెప్పారు. ఎస్ఆర్బీసీ, ఎస్ఎల్బీసీ ఒకేసారి మొదలైతే ఎస్ఆర్బీసీ పూర్తయ్యింది గాని, ఎస్ఎల్బీసీ ఇంకా పూర్తి కాలేదని, ఎస్ఎల్బీసీపై కాంగ్రెస్ మంత్రులు హంతకులే సంతాప సభ పెట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు మాట్లాడిన ప్రతిదీ అబద్ధమేనని, వారి మాటలపై ఎకడైనా చర్చకు తాము సిద్ధమేనని జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదని, తెలంగాణలోనే తెలంగాణ బిడ్డలను స్థానికేతరులను చేసే విధంగా జీవో 33 తెచ్చిందని, తెలంగాణకు ఇంతకన్నా ద్రోహం మరోటి ఉంటుందా అని ప్రశ్నించారు. రేవంత్ తన ఆంధ్రా మిత్రులనో, చంద్రబాబునో సంతృప్తి పరిచేందుకే జీవో 33 తెచ్చారా? అని నిలదీశారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని జీవో 33ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.