BRS MLA Jagadhish Reddy | నీటి పారుదల విషయంలో రాష్ట్ర మంత్రులకు అవగాహన, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం, నల్లగొండ మంత్రుల చేతగానితనంతోనే నాగార్జున సాగర్ కాలువ కట్టలు తెగిపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
మంత్రుల వైఫల్యాలను అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. దుర్మార్గంగా గేట్లకు వెల్డింగ్ చేసి లాకులు వేయడం వల్లే కాలువలు తెగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీ వల్లే కాల్వల మరమ్మత్తులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. అంతటా నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే ఇక్కడ మాత్రం పొలాలు ఎండుతున్నాయని, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ఐదుగురు మంత్రులు ఉన్నా రైతుల పొలాలకు నీళ్లందడం లేదని అన్నారు.
హడావుడిగా చేపట్టిన మరమ్మతు పనులు నాసిరకంగా మారాయని జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారుల మీద అరవడం మాని పొలాలకు నీళ్ళందించండని హితవు చెప్పారు. ప్రభుత్వ వికృత చర్యల వల్ల అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేక భయపడుతున్నారన్నారు. జరిగిన నష్టానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలదే బాధ్యత అని స్పష్టం చేశారు. గతంలో కాల్వలు తెగితే వారంలో నీళ్ళందించాం అని చెప్పారు.
రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ఏం మాట్లాడుతున్నాడోనని ప్రజలకు అనుమానం వస్తుందని జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ కాలువలు తెగడానికి ఎవరు కారణమో నిగ్గు తేల్చేందుకు విచారణకు సిద్ధమేనా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిలదీశారు. `మీలా చిల్లర రాజకీయాలు చేయడం మాకు అలవాటు లేదు. మీ వైఫల్యాలు కప్పిపుచ్చి బీఆర్ఎస్ పై నిందలు వేస్తారా? ఐదేండ్ల తప్పులు 10 నెలల్లో చేశారు. ప్రజలు అన్ని లెక్కకడుతున్నారు. అనుభవంలేకపోతే అధికారుల దగ్గర నేర్చుకోండి. కేసీఆర్ ఇచ్చిపోయిన వ్యవస్థలు ఉన్నది ఉన్నట్టుగా నడిపలేకపోతున్నారు. రాష్ట్రంలో ఒక్క వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలేదు. 24 రోజులు గడుస్తున్నా పొలాలకు నీళ్ళందడంలేదు. మంత్రులు పరిపాలన వదిలి ఇల్లు చక్కబెట్టుకునే పనిలోపడ్డారు. తక్షణమే 24 / 7 పనిచేసి మరమ్మత్తులు పూర్తిచేసి పొలాలకు నీళ్ళందించాలి` అని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.