హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ గుర్తు ప్రచారానికే కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని సృష్టించారు.. సమైక్య బాస్‌ల మెప్పు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నది.. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నిర్వహించిన సంబురాల్లో సినిమా పాటలతో మన అస్తిత్వాన్ని మంటగలిపారు..’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్, మన్నె గోవర్ధన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం నుంచి పుట్టిన భౌతికరూపమే తెలంగాణ తల్లి అని అభివర్ణించారు. రేవంత్‌రెడ్డి.. జీవోలు, గెజిట్లు, అధికారికమంటూ హస్తం గుర్తు విగ్రహాన్ని తయారుచేసి ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
తెలంగాణ తల్లికి గెజిటా?
‘కోట్లాది మంది ఆకాంక్షల నుంచి జనించిన ఆ స్వరూపానికి జీవో ఎందుకు? గెజిట్ ఎందుకు? రేవంత్‌రెడ్డికి ఇంగితజ్ఞానం లేకుంటే అధికారులకైనా ఉండొద్దా? మేం గతంలో ఏనాడైనా ఇలా వ్యవహరించామా?’ అంటూ జగదీశ్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల మెడపై కత్తిపెట్టి కొత్త తల్లిని ఆరాధించమని అడిగే హక్కు ఎవరికీ లేదని హెచ్చరించారు. కోయిలలు ఉన్నచోట కాకిలా ప్రవర్తించి దృష్టిని ఆకర్షించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.