MLA Jagadish Reddy | సూర్యాపేట : రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశంలో అతి చెత్త కేసుల్లో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదైన కేసు తప్ప మరొకటి లేదన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బడే బాయ్, చోటే బాయ్ కలసి ఏం పనులు చేస్తున్నారో ప్రజలు గమమనిస్తున్నారు. అయినా వీళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇచ్చినోడు తెలుసంట.. తీసుకున్నోడు తెలవదంట.. ఇది ఏం కేసో రేవంత్ రెడ్డికే తెలియాలి. తీసుకున్నోడు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు కాబట్టి ఆయనపై కేసు లేదు.. ఇందులో మొదటి నేరస్థుడు రేవంత్ రెడ్డి అందులో ఎలాంటి సందేహం లేదని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతు భరోసా ఎగ్గొట్టడానికి, రైతులను పక్కదారి పట్టించేందుకే కేటీఆర్‌పై పెట్టిన కేసును ముందుకు తీసుకువస్తున్నాడని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ జాబితాను ఫైనాన్స్ సెక్రటరీ సంతకం పెట్టి విడుదల చేయాలి. రుణమాఫీ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అందరికీ రుణమాఫీ చేశామని చెబుతుండు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.. ఇప్పుడు నిబంధనలు పెడుతున్నారు. రుణమాఫీ విషయంలో రూ. 46 వేల కోట్లు అని చెప్పి రూ. 36 వేల కోట్లు కేటాయించి, రూ. 26 వేల కోట్లు క్యాబినెట్లో ఆమోదించి రూ. 18 వేల కోట్లను విడుదల చేసి 12 వేల కోట్లను మాత్రమే మాఫీ చేశారని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
కేసీఆర్ తెచ్చిన ప్రతి అప్పుకు ఆస్తి ఉందని, సంవత్సర కాలంలో మీరు తెచ్చిన రూ. 1,28,000 కోట్లతో ఎక్కడైనా ఒకచోట ఒక్క ఆస్తి నిర్మాణమైన చేశారా చెప్పాలి.. కొత్త పథకం ఏమైనా ఇచ్చారా చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ పథకానికి ఒక రూపాయి ఇవ్వకుండా ఢిల్లీకి కొన్ని, మీరు కొన్ని పంచుకొని రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పు వేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఒక ఉద్యోగం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రజాప్రతినిధులను ప్రతి వర్గం నిలదీయాల్సిన అవసరం ఉంది అని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Cabinet Meeting | 4 గంటలకు క్యాబినెట్ మీటింగ్.. రైతు భరోసాలో కోతలేనా?
Nallagonda | నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
RS Praveen Kumar | బాగా చెప్పారు కేటీఆర్ గారూ.. కాంగ్రెస్ అంటేనే చీటింగ్ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్