సూర్యాపేట, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ‘దండం పెట్టి అడుగుతున్నా.. పంటలకు నీళ్లియ్యండి. ఇప్పటికే సగం పంటలు ఎండినయ్.. ఇప్పుడు నీళ్లిచ్చినా మిగతా సగం పంటలనైనా కాపాడుకోవచ్చు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్‌పహాడ్ మండలం గాజుల మల్కాపురం, చిన్నగారకుంటతండాలో ఎండిన పంటలను శనివారం ఆయన పరిశీలించారు. జగదీశ్‌రెడ్డి వచ్చారనే విషయం తెలిసిన రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు.
‘కేసీఆర్ పాలనలో, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఎకరం కూడా ఎండలేదని, పుష్కలంగా నీళ్లతో మడికట్లలో చేపలు కూడా పట్టుకున్నాం’ అని రైతులు తెలిపారు. ఏడేండ్ల తరువాత మళ్లీ ఇలా ఎండిన పంటను చూడాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గాజుల మల్కాపురంలో పొట్టదశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పెడుతున్న రైతు గుండా వెంకన్నను చూసి చలించిన జగదీశ్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. అనంతరం అక్కడికి వచ్చిన మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టి రైతుల ఉసురు తీస్తున్నదని, ఇచ్చేందుకు నీళ్లున్నా ఇసుక వ్యాపారం కోసం పంటలు ఎండబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్క కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలన్నీ పండుతాయని తెలిపారు. ‘కేసీఆర్ సర్కారులో గోదావరి జలాలను రైతులు వద్దనేంత వరకు ఇస్తే పంటలు బాగా పండించారు. ఇవ్వాల దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతూ పంటలను ఎండబెడుతున్నది. చేతకాని ప్రభుత్వం పనికి రాదంటున్న కాళేశ్వరాన్ని మాకు అప్పగిస్తే మూడు రోజుల్లో చివరి ఎకరం వరకు నీళ్లు పారిస్తాం’ అని సవాల్ విసిరారు. కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని రైతులను కష్టపెట్టడం బాధాకరమని అన్నారు. రైతాంగాన్ని నట్టేట ముంచేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కేవలం కాల్వల్లో పారేందుకు గోదావరి నీళ్లు వదులుతూ చివరి వరకు రాక ముందే నీటిని బంద్ చేస్తుండటం దుర్మార్గమని పేర్కొన్నారు.
నీటిని ప్రకటించిన షెడ్యూల్‌కు మూడు రోజుల తరువాత విడుదల చేసి, మూడు రోజుల ముందే బంద్ చేస్తున్నారని, దాంతో పొలాల్లోకి నీరు చేరడం లేదని తెలిపారు. తాము ఏది మాట్లాడినా రాజకీయం అనడం కాంగ్రెస్‌కు ప్యాషన్ అయ్యిందని విమర్శించారు. తాను రాజకీయం చేయడం లేదని.. నీళ్లు లేక ఎండిన పొలాల్లోకి గొర్లు, పశువులు వచ్చి మేస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించి నీళ్లిస్తే వేసిన పంటలో కొంత మేరకైనా చేతికి వస్తుందని సూచించారు. దాంతోనైనా పెట్టుబడి వస్తదనే ఆశతో రైతులు ఉన్నారని తెలిపారు. రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహిరించడం మంచి పద్ధతి కాదని అన్నారు. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా.. దయచేసి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలని జగదీశ్‌రెడ్డి కోరారు.