జనగామ, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన బట్టేబాజ్ కాంగ్రెస్.. 60 రోజుల్లోనే రైతాంగానికి 4 మోసాలు చేసి వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, సీఎం రేవంత్‌రెడ్డి నిజ స్వరూపంపై ప్రజల్లో చర్చకు పెట్టాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం జనగామలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు.. ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన నాలుగు హామీలైన రూ.2 లక్షల రుణమాఫీ, 24 గంటల నాణ్యమైన కరెంటు, రూ.15 వేల రైతు భరోసా, ధాన్యానికి రూ. 500 బోనస్, రూ.4 వేలకు పింఛన్ల పెంపుపై చేసిన ప్రకటనల వీడియో క్లిప్‌లను స్క్రీన్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు చూపించారు. అనంతరం మాట్లాడుతూ.. ఝూటా మాటలతో సీఎం రేవంత్‌రెడ్డి కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రియాంక సమక్షంలో రేవంత్‌రెడ్డి నిరుద్యోగ భృతి హామీ ఇస్తే.. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వలేదని అబద్ధాలు చెప్పిన అంశాన్ని హరీశ్ వీడియో క్లిప్‌లో చూపించారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 40 రోజుల గడువే మిగిలి ఉందని, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంటే ముందే జీవో లు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ప్రజలకు చెప్పిన మాటలు, రైతులకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అడిగిన ప్రజలను మంత్రులు, ఎమ్మెల్యేలు ద బాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కంటే ముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగేందుకు మంచినీళ్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు. కాం గ్రెస్ హయాంలో కరువుతో వలసలు పోతే.. తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు వాపస్ వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో రూపాయి ఆదా యం లేకున్నా అన్ని బిల్లులు ఆపి పంట సీజన్‌కు ముందే రైతుబంధు డబ్బులు వేశామని గుర్తుచేశారు.
రైతులకు పెట్టుబడి ఆపి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశామని చెప్తున్న కాం గ్రెస్ సర్కార్.. ఈ నెల 7వ తారీఖు గడుస్తున్నా ఇంకా జీతాలు రాలేదని, రైతు భరోసా 3 ఎకరాల వరకే వేశారని విమర్శించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.2500, పింఛన్ రూ.4 వేలకు పెంచకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలు, రైతుల ఓట్లు ఎట్లా అడుగుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 96 లక్షల టన్నుల ధాన్యం పండితే.. ఇప్పుడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తున్నదని, ఇదంతా ఊరికనే సాధ్యమైందా? కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్న నాయకులు కేసీఆర్ వల్లే ఇంత దిగుబడి పెరిగిందన్న సంగతి తెలియ దా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం పరువు తీసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష, రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ మాట్లాడిన మంత్రి ప్రవర్తన చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతున్నదని వివరించారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే 6 గ్యారెంటీలు అమలవుతాయన్న సీఎం మాట లు విడ్డూరంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో దేశం మొత్తంలో కాంగ్రెస్‌కు 47 సీట్లు వస్తే ఈసారి 40 సీట్లకు పరిమితమై కనీసం ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు వ్యంగ్యం తప్ప వ్యవహారం తెలవదని, ప్రగతి భవన్ కట్టిస్తే అందులో బంగారు బాత్రూంలు కట్టించుకున్నారని అబద్ధపు ప్రచారాలు చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ గల్లీ సమస్యలను పార్లమెంట్ వేదికగా వాణి వినిపించేలా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ మెడలు వంచి నాయకులకు బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.