Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య బంధం ‘చీకట్లో దోస్తీ.. వెలుతురులో కుస్తీ’ అనే విషయం అందరికీ తెలిసిపోయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సర్కస్ ఫీట్లు చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి సర్కస్ ఫీట్లను చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని దెప్పిపొడిచారు. రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ జామ్ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ధర్నాలో పాల్గొన్న మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద, డాక్టర్ సంజయ్, చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, విజయుడుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చట్టం అందరికీ సమానమే అయితే కాంగ్రెస్ నేతలందరిపైనా కేసులు పెట్టాలి’ అని డిమాండ్ చేశారు.
అదానీపై మాట్లాడేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి ధైర్యం చాలడం లేదని ఎద్దేవాచేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు శాసనసభకు అదానీ, రేవంత్‌రెడ్డి ‘ఆర్థిక’బంధాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీగా తాము తమ టీషర్ట్స్‌పై స్టిక్కర్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తే అడ్డుకున్న ప్రభత్వం, అదే అదానీతో పోరాటం చేస్తున్నామని చెప్పేది నిజమైతే తక్షణమే అదానీతో చేసుకున్న రూ. 12,400 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదానీ, రేవంత్‌రెడ్డి దోస్తీకి కట్టుబడి సభా ప్రాంగణంలోకి కూడా తమను అడుగుపెట్టనివ్వలేదని ఆయన నిప్పులు చెరిగారు.
రాజ్‌భవన్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి అదానీ అవినీతిపై మాట్లాడటం సరస్ చేస్తున్నట్టు ఉందని విమర్శించారు. రాజ్‌భవన్ వద్ద కూడా రేవంత్ బీఆర్ఎస్, కేసీఆర్‌పై మాట్లాడిందే ఎక్కువని, అదానీ అవినీతిపై మాట్లాడింది తక్కువని అన్నారు. ‘అదానీ మీద మీ పోరాటం నిజమే అయితే మొదటి రోజు మమల్ని అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? నిరసన తెలిపే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు.. మేము అడుగుతున్నా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టడం లేదు? దావోస్ వెళ్లి అదానీతో రూ.12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నావు.. నీకు నిజంగా అదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు ఆ అగ్రిమెంట్లు రద్దు చెయ్యి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రామన్నపేటలో డ్రైపోర్టు కోసం భూమి ఇస్తే అందులో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చింది సీఎం రేవంత్‌రెడ్డి కాదా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి అదానీకి ఎజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించినవారిని అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీపై రేవంత్‌రెడ్డి చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంటే, ప్రజల మీద కోరిక ఉంటే అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్ అని, చేస్తున్నది సర్కస్ ఫీట్లేనని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి పంపిణీ చేసిన చెక్కులు కూడా చెల్లని దయనీయ పరిస్థితి నెలకొన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంవత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిని దిగజారుస్తున్నారని విమర్శించారు. సహజంగా సీఎం ప్రకటన చేస్తే దానికి తిరుగు ఉండదని, కానీ రాష్ట్రం లో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయ న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి తన స్థాయికి తగిన నిర్ణయాలు తీసుకోవటం లేదని వాపోయారు. రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయాలతో దేశవ్యాప్తంగా సీఎం పరువు పోతోందన్నారు.
ఇటీవల నవంబర్ 30న రాష్ట్రంలోని 3 లక్షల 13 వేల మంది రైతులకు రుణమాఫీని వర్తింప చేస్తున్నామని, అందు కోసం రూ.2474 కోట్లను విడుదల చేస్తున్నామని సీఎం ప్రకటించారని, 18 రోజులు పూర్తి అయినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని గొప్పలు చెప్పుకుని వరంగల్‌లో స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రూ.35 కోట్ల చెక్కు, ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తున్నామని, అందుకోసం విడుదల చేస్తున్నామని ఇచ్చిన రూ. 281 కోట్ల చెక్కు ఇంకా జమకాలేదని ఆయన విమర్శించారు. అయితే, ఇందులో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉం దని, సీఎం బద్నాం అవుతారని భావించి ఆర్టీసీ తన నిధులతో ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసిందన్నారు.