హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొకడమే తప్ప, సమస్యల పరిషారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపపడ్డారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి గురుకులాల ఖ్యాతిని కాపాడాలని హితవుపలికారు. వేడి రాగిజావ పడి గాయపడ్డ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని బుధవారం ఎక్స్ వేదికగా కోరారు.
‘తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనం. 1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు దేశంలో మొదటి గురుకులాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్లో ప్రారంభించారు. ఇప్పుడు అదే గురుకులంలో విద్యార్థితో వంట చేయిస్తే, వేడి రాగిజావ పడి ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి దవాఖాన పాలైన దుస్థితి. ఓవైపు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ, మరోవైపు అదే సమయంలో ఈ దారుణం’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థి కాలిన గాయాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే పెసా మొబిలైజర్స్కు 13 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీరికి నెలకు రూ.4000 చొప్పున ఒకొకరికి రూ. 52 వేలు ఈ ప్రభుత్వం బకాయి పడిందని బుధవారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప, ఆచరణ ప్రశ్నార్థకమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. చిరుద్యోగులకు కూడా జీతాలు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెట్టడం దుర్మార్గమని, నెలనెలా వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.