Harish Rao | సిద్దిపేట : సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి స్పష్టం చేశారు. పంద్రాగస్టు లోగా ఆరు గ్యారెంటీలు, రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తే.. రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.ప్రెస్ అకాడమీ చైర్మన్ వద్ద ఇద్దరి రాజీనామాలు ఉంచుదాం. రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే తన రాజీనామా లేఖ పంపిస్తాను. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ అందజేస్తాను. పంద్రాగస్టు లోగా ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామా ఆమోదించుకుంటాను. ఆ తర్వాత సిద్దిపేటకు రేవంత్ రెడ్డిని పిలిపించి శాలువాతో సన్మానం చేస్తానని పేర్కొన్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఆ గడువు దాటిపోయినా పత్తా లేదన్నారు. ఇప్పుడేమో పంద్రాగస్టు లోగా చేస్తామని చెబుతున్నారు. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. రాష్ట్రాన్ని తెచ్చింది సిద్దిపేటనే.. తెలంగాణ రావడానికి కేసీఆరే కారణం. తెలంగాణకు, కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి చెప్పడం పచ్చి అబద్దం.. ఇది ప్రజలందరికీ తెలుసు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.