Harish Rao | కరీంనగర్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/గజ్వేల్ : మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక ప్రజాయుద్ధం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు గ్యారెంటీల గారడీ చూపించి, బాండ్ పేపర్లు పంచి ఇప్పుడు వాటి అమలు మర్చిపోయారని, ఆరు గ్యారెంటీల హామీలిచ్చిన రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నాడని, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను అన్యాయంగా కూలుస్తున్నాడని ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్స్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ అలయ్.. బలయ్ సభ, గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని, వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 13 హామీలు నెరవేర్చుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 300 రోజులు దాటుతున్నా ఏ ఒక్కటీ అమలు చేయలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, వారిని ముందుండి నడపాల్సిన బాధ్యతను బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమలు చేసిన అనేక పథకాలను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, పథకాలు పంచే కేసీఆర్‌ను వదులుకొని ఫొటోలకు ఫోజులిచ్చే రేవంత్‌రెడ్డిని తెచ్చుకున్నామని బాధపడుతున్నారని చెప్పారు.
ఉన్న రైతుబంధు కూడా పోయింది
రైతుబంధు ఇప్పుడైతే రూ.10 వేలు, రేపైతే రూ.15 వేలు అని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను రైతులు నమ్మారని, ఉన్న రైతుబంధు రద్దయితదని వాళ్లు కలలో కూడా అనుకోలేదని హరీశ్ తెలిపారు. వరుసగా రెండేళ్లు కరోనా వచ్చినా, ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేక పోయినా రైతులకు సమయానికి కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. రైతుభరోసా పేరుతో రూ.15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పెట్టిన రూ.10 వేలైనా ఇవ్వలేక పోయిందని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వస్తే నిలదీసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11 విడతల్లో రూ.72 వేల కోట్లు రైతుబంధు ఇచ్చామని, ఇప్పుడు ఒక్క విడత ఇవ్వడానికే రేవంత్‌రెడ్డికి ముక్కులకు వస్తదెట్లా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నదని దుయ్యబట్టారు. రైతులు సంఘటితమై పోరాడకుంటే యాసంగికి కూడా రైతుభరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు.
బీఆర్ఎస్ పథకాలన్నింటినీ నిలిపి వేస్తున్నారని, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదని, ఈ పది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.25 వేలు బాకీ పడిందని, ఈ విషయాన్ని ప్రతి మహిళకు బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పాలని సూచించారు. బతుకమ్మ పండుగకు రెండు చీరలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, రేవంత్‌రెడ్డి మోసాన్ని మహిళలే గ్రహిస్తున్నారని చెప్పారు. ఆసరా పింఛన్లు రూ.4 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి పది నెలల్లో రెండు నెలల పింఛన్లు ఎగవేశారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఏ ఒక్క మాట మీద నిలబడ లేదని నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అని, ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తేనే ఇస్తామని చెప్తున్నారని, రైస్ మిల్లర్లే సన్న వడ్లను రూ.3 వేలకు క్వింటాలు చొప్పున కొనుక్కుపోతున్నారని, అంటే బోనస్ కూడా ఎగవేసే పరిస్థితిలోనే ప్రభుత్వం ఉన్నదని స్పష్టంచేశారు.
దేవుళ్లనే మోసం చేసిన సీఎం
కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయని హరీశ్ మండిపడ్డారు. రుణమాఫీ పూర్తయ్యింది రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తనకు సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేసిన హరీశ్‌రావు, మానకొండూర్ నియోజకవర్గంలో ఏగ్రామానికి వస్తావో రమ్మని, ఒక్క ఊరిలోనైనా రుణమాఫీ పూర్తయ్యిందని నిరూపించగలవా? అని సవాల్ విసిరారు. దేవుళ్లనే మోసం చేసిన సీఎంను రేవంత్‌రెడ్డినే చూస్తున్నామని మండిపడ్డారు. మహిళలకు ఒక్క బస్సు తప్ప అంతా తుస్సేనని, ఆ బస్సు కూడా ఆగమాగమే ఉన్నదని ఎద్దేవాచేశారు.
యువతను వీపులు పగిలేలా కొడుతున్నరు
నిరుద్యోగ యువతను టెర్రరిస్టులు, దొంగలు, బందిపోట్లు, నక్సలైట్లను కొట్టినట్టు కొడుతున్నారని, వీపులు కమిలిపోయేలా కొడుతున్నారని, ఆడపిల్లలని కూడా చూడకుండా అర్ధరాత్రి వ్యాన్లలో తీసుకెళ్లి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ పిల్లలు మన తెలంగాణ పిల్లలుకారా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ నోటిఫై చేసిన 30 వేల ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకొంటూ ఫోజు లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి దమ్ముఉంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్ రావాలని సవాల్ విసిరారు.
ఎవరిని ఉద్ధరించేందుకు మూసీ?
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 38 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిచ్చామని, రూ.93 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని, 38 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చయితే తప్పని అంటున్నారని, మూసీ సుందరీకరణకు మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతానని అంటున్నారని, ఇది ఎవరిని ఉద్ధరించేందుకని హరీశ్ ప్రశ్నించారు. ఆ సుందరీకరణ వెనుక ఉన్న మర్మం ఏమిటో ప్రజలకు అర్థమమైందని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాలకు లేని పైసలు మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే ఉద్దేశంతోనే మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాలపై తాము ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని, నిందలు వేస్తున్నారని, అరెస్టులకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు.
రేవంత్రెడ్డేం పర్మినెంట్ కాదు..
ఏనాడూ అమరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించని రేవంత్‌రెడ్డి తప్పిదారి సీఎం అయ్యాడని హరీశ్ దుయ్యబట్టారు. అధికార పార్టీ మెడలు వంచడం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ హక్కు అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, పోలీసులు చట్ట ప్రకా రం నడుచుకోవాలని సూచించారు. తేడా వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పెద్ద అధికారులు కూడా జైల్లో ఊచలు లెక్కిస్తున్నారని, రేవంత్‌రెడ్డి ఏం పర్మినెంట్ కాదని, అతిగా ప్రవర్తించి నా, అన్యాయంగా కేసులు పెట్టినా, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా రేపు పోలీసులు కూ డా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. ‘మనం చేసేది న్యాయమైన, ధర్మమైన, ప్రజల పక్షాన చేసే పోరా టం.. రైతులు, నిరుద్యోగులు, పేదల పక్షాన పోరాడుతున్నం.. కార్యకర్తలు ధైర్యంగా ఉండా లి’ అని హరీశ్ సూచించారు.
మెరుగైన పరిహారం ఇచ్చినం
2013 భూసేకరణ చట్టం ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందించామని, దేశంలో నే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన కాలనీలను మూట్రాజ్‌పల్లి, సంగాపూర్, తునికిబొల్లారంలో కేసీఆర్ నిర్మించారని హరీశ్‌రావు స్పష్టంచేశారు. మూసీ బాధితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా బలవంతంగా పంపిస్తున్నది మీరుకాదా? అని ప్రశ్నించారు. 675 ఎకరాల్లో సింగిల్ లే అవుట్ వేసి దేశంలోనే అతిపెద్ద కాలనీని మూట్రాజ్పల్లిలో నిర్మించి అండ గా నిలబడింది కేసీఆర్ అని గుర్తుచేశారు. సోనియాగాంధీ తెచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారమే 121 గజాల్లో ఇంటిని ఏడెనిమిది లక్షలతో నిర్మించి ఇచ్చామని చెప్పారు.
మొత్తం 3,414 ఇండ్లు నిర్మించగా మూట్రాజ్పల్లిలో 2,273, తునికిబొల్లారంలో 1,141 ఇండ్లను కట్టి చేతి ఖర్చులకు రూ.50వేల చొప్పున ఇచ్చి గృహ ప్రవేశాలు చేయించామని తెలిపారు. 8 వేల మందికి 250 గజాల ఇంటి స్థలం, నిర్మాణాలకు రూ.5లక్షలు, పెండ్లి కాని అమ్మాయిలకు రూ.5లక్షలు, బ్రహ్మాండమైన ఇండ్లను నిర్మించి ఇచ్చింది నిజం కాదా? అని నిలదీశా రు. కేసీఆర్ ఇచ్చిన ప్లాటు విలువ అప్పుడు రూ.25లక్షల నుంచి రూ.30 లక్షలుంటే ఇప్పు డు కాంగ్రెస్ వచ్చినంక తగ్గిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రంలో ఆగమయిందని చెప్పారు. ప్రతి ఇంటికి సుమారు కోటి వరకు సాయం చేశామని మీరు ఇవ్వాలనుకుంటే మ రో రూ.50 లక్షల సాయం చేయాలని, పూల దండలతో స్వాగతించి శాలువా కప్పుతామని చెప్పారు. ఆర్అండ్ఆర్ కాలనీకి రూ.2000 కోట్లు వెచ్చించామని తెలిపారు. ‘ఆనాడు ప్రా జెక్టులను అడ్డుకొని కేసులు వేయించిన మీకు చేతనైతే డబుల్, ట్రిపుల్ పరిహారం బాధితులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్లో కేసీఆర్ ఇచ్చిన దాంట్లో మూసీ బాధితులకు రేవంత్‌రెడ్డి 10 పైసల సాయం కూడా చేయలేదని దుయ్యబట్టారు. తునికిబొల్లారం లో 180 ఎకరాల్లో రూ.20 కోట్లతో కాలనీ ఏ ర్పాటు చేసి 1,141ఇండ్లు నిర్మించామని చె ప్పారు.
400 ఎకరాల్లో ఏర్పాటైన పరిశ్రమల్లో వెయి మందికి ఉపాధి దొరికిందని తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం వర్గల్లో 1100 ఎకరాలు సేకరిస్తే కాంగ్రెస్ ఎన్జీటీలో కేసులు వేయించి పరిశ్రమలను అడ్డుకొని బ్లాక్‌మొయిల్ చేస్తున్నదని మండిపడ్డారు. మూసీ బాధితులకు గచ్చిబౌలిలోని 470 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన లే అవుట్ చేసి 250 గజాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు, గుడి, బడి, మజీద్, చర్చిలను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు బోయినపల్లి వినోద్‌కుమార్, జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్‌సింగ్, నారదాసు లక్ష్మణ్‌రావు, సిద్ధం వేణు, గడ్డం నాగరాజు, రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, శివకుమార్, దేవీ రవీందర్, బెండే మధు, జకీయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇల్లు, ఇంటి యజమానికి రూ.7.50 లక్షలు, 18 ఏండ్లు నిండిన వారికి 250 గజాల ప్లాటు, పెండ్లికాని అమ్మాయిలకు రూ.5లక్షల చొప్పున మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులకు ఇచ్చినం. మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేసిండని రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నడు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా మూసీ బాధితులను బలవంతంగా వెళ్లగొడుతున్నది మీరు కాదా? అన్యాయం మల్లన్నసాగర్లో జరిగిందా? మూసీలో జరిగిందా?
– హరీశ్‌రావు
ముఖ్యమంత్రి తన పేరు మార్చుకోవాలి.. ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని ఇప్పటి నుంచి పిలుస్తం. చీఫ్ మినిస్టర్‌గా పిలిపించుకోదల్చుకున్నవా? చీటింగ్ మ్యాన్‌గా పిలిపించుకోదల్చుకున్నావా? రేవంత్‌రెడ్డే తేల్చుకోవాలి.
-హరీశ్‌రావు
మూసీ సుందరీకరణ పనులకు అడ్డొస్తే నన్ను, కేటీఆర్‌ను బుల్డోజర్ కింద వేసి చంపేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నడు.. చావడానికైనా సిద్ధంగా ఉన్నాం తప్ప, తెలంగాణ
ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. ప్రాణాలకు భయపడేటోళ్లమే అయితే కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేటోళ్లమే కాదు.
-హరీశ్‌రావు
పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. చంపుతం.. కేసులు పెడుతం.. అక్రమంగా అరెస్టులు చెస్తం అని బెదిరిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడేటోళ్లు కాదు. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేవాళ్లెవరూ లేరు. పేదలకు అన్యాయం జరిగితే ఎదిరించేందుకు దేనికైనా సిద్ధపడ్డం. రేవంత్‌రెడ్డిని విడిచేది లేదు.. ఆయన వెంట పడుతం. వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డితో కొట్లాడినోళ్లం.. సమైక్యాంధ్రలో కర్కశ కాంగ్రెస్‌తో కొట్లాడినోళ్లం.. ఈ రేవంత్‌రెడ్డితో కొట్లాడలేమా?
-హరీశ్‌రావు