జైరాం రమేశ్, చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్‌కు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు. కాంగ్రెస్‌లో అంతకంటే లేడు. రెండుకండ్ల సిద్ధాంతంతో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్షలో ఉన్నాడు. అందువల్ల బిల్లు ఎవరు తయారు చేశారో, ఎవరు ప్రవేశపెట్టారో ఆయనకు తెల్వదు.
-మాజీ మంత్రి హరీశ్‌రావు
Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కాంగ్రెస్ సర్కారుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చురకలంటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వితండవాదం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి జాతి ప్రయోజనాలను పణంగా పెట్టారని, తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిన అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదే విషయమై తెలంగాణ భవన్లో పలువురు బీఆర్ఎస్ సీనియర్‌నేతలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంసారం లేని భాష, వికారమైన ధోరణి కనిపించాయని, అంతకు మించి మరేమి లేదని నిప్పులు చెరిగారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాగా రేవంత్ మాటలు.
నాడు పెదవులు మూసుకున్నదెవడు? అమ్ముడుపోయినోడు ఎవడు?
పార్టీలు మారినోడు ఎవడు? ప్రజల కోసం త్యాగాలు చేసినోడు ఎవడు?
– హరీశ్‌రావు
ముఖ్యమంత్రి మాట్లాడిన ధోరణి చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు చేయబోనని ఉదయం చెప్పిన సీఎం, సాయంత్రానికల్లా మాటతప్పారని మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్‌ను నీచమైన పద్ధతిలో వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రాజెక్టుల అప్పగింత విషయంలో రేవంత్ ఎన్ని మాటలు చెప్పినా సారాంశం ఒకటే.. పదేండ్లలో కేసీఆర్ కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే అప్పనంగా అప్పగించేసింది. అది దాచేసినా దాగని సత్యం’ అని వెల్లడించారు.
కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకొంటూ కేసీఆరే స్వయంగా సంతకం పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారు. ఆ సమావేశానికి అసలు కేసీఆరే హాజరుకాలేదు.
మరి సంతకాలు ఎలా పెట్టారు?
– హరీశ్‌రావు
మీటింగ్ మినిట్స్‌నే సాక్ష్యం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఒకసారి కేంద్రజల్‌శక్తి, మరోసారి కేఆర్ఎంబీ మీటింగులు నిర్వహించిందని హరీశ్‌రావు వెల్లడించారు. ఆయా సమావేశ మినిట్స్‌లోనే ప్రాజెక్టులకు అప్పగింతకు తెలంగాణ అంగీకరించిందని స్పష్టంగా వెల్లడయిందని తెలిపారు.
జనవరి 17న నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింత అనంతరం నిర్వహణ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఇరు రాష్ర్టాలు చర్చించుకొని, అందుకు సంబంధించిన యాక్షన్‌ప్లాన్‌ను వారంలోనే అందజేయాలని, రెండు రాష్ర్టాలు మొత్తంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను నెలరోజుల్లోగా అప్పగించాలని కేంద్రజల్‌శక్తిశాఖ స్పష్టంగా తెలియజేసిందని వివరించారు.
బోర్డు అనుమతి ఉంటేనే సీఆర్పీఎఫ్ బలగాలు ప్రాజెక్టులపై రెండు రాష్ర్టాలను అధికారులను అనుమతిస్తారని, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి నిధులను విడుదల చేయాలని మినిట్స్‌లో తెలిపిందని ఉటంకించారు. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మతి తెలిపిందని ధ్వజమెత్తారు. అవే అంశాలను ప్రముఖ పత్రికలు రాశాయని, కానీ తాను పత్రికా సమావేశం పెట్టి నిలదీసేంతవరకూ తెలంగాణ ప్రభుత్వంలో కదలిక లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు.
ప్రాజెక్టులను అప్పగించకుంటే పత్రికల్లో కథనాలు వచ్చిన మరుసటిరోజే ప్రభుత్వం ఎందుకు ఖండించలేదని కాంగ్రెస్ సర్కారును నిలదీశారు. తాము మాట్లాడిన అనంతరమే స్పందించి అప్పుడు ప్రాజెక్టుల అప్పగింతను ఒప్పుకోలేదని, లేఖ రాస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. ఆ మాటకైనా కట్టుబడి ఉంటుందా అంటే అదీలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జనవరి17నాటి సమావేశానికి కొనసాగింపుగా ఈ నెల 1న కేఆర్ఎంబీ రెండో సమావేశాన్ని నిర్వహించిందని వివరించారు.
ప్రాజెక్టుల అప్పగింతకు ఏపీ అంగీకరించిందని మినిట్స్‌లో స్పష్టంగా బోర్డు వెల్లడించిందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ జలవిద్యుత్తు ప్రాజెక్టుల ఔట్లెట్ల అప్పగింతకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని అధికారులు అడిగినట్టు బోర్డు తెలిపిందని హరీశ్‌రావు వెల్లడించారు. రెండు రాష్ర్టాల అధికారులు బోర్డు అనుమతి తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుల వద్దకు వెళ్లాలని, ఔట్లెట్ల నిర్వహణకు ఇరు రాష్ర్టాలు బోర్డుకు ఉద్యోగులను అప్పగించాలని, అయితే వారి జీతాలను ఆయా రాష్ర్టాలే చెల్లించాల్సి ఉంటుందని ఆ బోర్డు మీటింగ్ మినిట్స్‌లో కూడా స్పష్టంగా ఉన్నదని తెలిపారు.
విద్యుత్తు ప్రాజెక్టుల అప్పగింతకే అభ్యంతరం తెలిపారంటే మిగతా ప్రాజెక్టుల ఔట్లెట్ల అప్పగింతకు సమ్మతం తెలిపినట్టు కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అదీగాక ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకారం తెలుపకపోతే నిర్వహణ తదితర అంశాలు చర్చకు ఎందుకు వచ్చాయని, వాటికి ఎందుకు ఒప్పుకొన్నారని నిలదీశారు. మీటింగ్ అనంతరం కూడా అవే అంశాలను ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు పత్రికాముఖంగా వెల్లడించారని తెలిపారు.
ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు రెఫర్ చేయాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కరాఖండిగా తేల్చిచెప్పింది. అయినప్పటికీ వాటిని మరుగునపరచి సీఎం రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారు.
– హరీశ్‌రావు
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి
ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకొని కేసీఆరే స్వయంగా సంతకాలు చేశారని రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని. ఇలాంటి జూటా సీఎం ఉంటారా? అని ధ్వజమెత్తారు. సచివాలయంలో కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడటం సరికాదని చురకలంటించారు. సీఎం రేవంత్‌రెడ్డి దగుల్బాజీతనాన్ని, అబద్ధాలను ప్రజలు, మేధావులు గుర్తించాలని కోరారు.
చేసిన తప్పును కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్పై ఎదురుదాడికి దిగుతున్నారని, దుర్భాషలు ఆడుతున్నారని విమర్శించారు. ఇది ముఖ్యమంత్రికి తగదని హితవు పలికారు. పార్టీలుగా ఎన్నికల రాజకీయాలు వేరని, కానీ ప్రాజెక్టుల అప్పగింత అంశం రాష్ట్ర ప్రయోజనాలు, జాతి భవిష్యత్తు అని వెల్లడించారు. భేషజాలకు పోకుండా రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సీఎం రేవంత్‌రెడ్డికి హితవుపలికారు.
పేగులు తెగేదాకా కొట్లాడినం..
2004లో పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేయాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం చేసినప్పుడు, తాను, నాయిని నర్సింహారెడ్డి పదవులకు ఆశపడి పెదవులు ముసుకున్నామని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. పోతిరెడ్డి విస్తరణ నిర్ణయానికి 3 నెలల ముందే తాము అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్నామని గుర్తుచేశారు.
610జీవో అమలు చేయడం లేదని, తెలంగాణను ముంచి పులిచింతలను కడుతున్నారని, తెలంగాణ ప్రాంతానికి వైఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, ఎన్కౌంటర్లు చేస్తున్నారని నిరసనగా రాజీనామాలను చేశామని తెలిపారు. అందుకు సంబంధించిన పత్రికల క్లిప్పింగ్‌లను సైతం విలేకరుల సమావేశంలో చూపించారు.
2005 జూలై 4న మంత్రి పదవులకు తాము రాజీనామా చేశామని, 2005 సెప్టెంబర్ 13న జీవో నంబర్ 170, ఆ తర్వాత జీవో 233 విడుదల చేశారని తెలిపారు. అయినప్పటికీ తాము పదవుల్లో ఉన్నప్పుడే జీవో వచ్చిందని రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. జీవో వచ్చిన తరువాత దానిపై తాము పేగులు తెగేవరకూ కొట్లాడామని, అసెంబ్లీలో అడ్జర్న్‌మెంట్ మోషన్ ఇచ్చి 40 రోజులు స్తంభింపజేశామని వివరించారు.
పోతిరెడ్డిపాడు విస్తరణతో తెలంగాణకు తీరని నష్టమని వాదనలు వినిపించింది తామేనని, తమ పోరాటానికి గొంతు కలిపింది కాంగ్రెస్ ఏకైక నాయకుడు పీజేఆరేనని వివరించారు. తాము గడ్డిపోచల్లాగా నాడు పదవులు వదులుకున్నామని, కానీ నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రులే పదవుల కోసం నాడు పెదవులు మూసుకున్నారని ధ్వజమెత్తారు.
పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర రేవంత్, ఆయన సహచరుల మంత్రులదేనని నిప్పులు చెరిగారు. రేవంత్ మాటలు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే లాగా ఉన్నాయని విమర్శించారు. ‘పెదవులు మూసుకున్నదెవడు? అమ్ముడుపోయినోడు ఎవడు? పార్టీలు మారినోడు ఎవడు? ప్రజల కోసం త్యాగాలు చేసినోడు ఎవడు?’ అని ధ్వజమెత్తారు. ఇకనైనా వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని చురకలంటించారు.
విభజన చట్టం చేసిందెవడు?
తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టంలో ప్రతిపాదిస్తే నాడు ఎంపీలుగా ఉన్న కేసీఆర్, కేశవరావు అడ్డుకోవాల్సింది పోయి, చట్టాన్ని ఆమోదించేలా ఓటేశారని రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసలు విభజన బిల్లు రూపొందించిందెవడు? అనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా జైరాం రమేశ్, చిందబరం, ప్రణబ్‌ముఖర్జీ పర్యవేక్షణలో విభజన బిల్లును రూపొందించారు.
ఇది రేవంత్‌రెడ్డికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలోనే లేడు. కాంగ్రెస్ పార్టీలో అంతకంటే లేడు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ రెండుకండ్ల సిద్ధాంతంతో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్షలో ఉన్నారు. అందువల్ల బిల్లు ఎవరు తయారు చేసిన్రు. ఎవరు ప్రవేశపెట్టిన్రు తెలిసి ఉండకపోవచ్చు. కానీ సీఎం స్థాయిలో మాట్లాడేప్పుడు కనీసం తెలుసుకొనైనా మాట్లాడాలి కదా.
ఇక విభజన చట్టంలో కేఆర్ఎంబీ ఒక అంశం. ఒకవైపు నాలుగు కోట్ల మంది ప్రజలు ఆ బిల్లు పాసైతదా? లేదా? అని చూస్తా ఉంటే తెలంగాణ ఆమోదానికి ఓటేయాలా? వద్దా? ముందుకు తెలంగాణ రాష్ట్రం తీసుకోవాలా? ఓ చిన్న అంశంకోసం ఆగాలా? ఇక బిల్లును రూపొందించింది..ప్రవేశపెట్టింది.. ఆమోదించింది కాంగ్రెస్ పార్టీనే. మరి ఇందులో ఆ పార్టీకి బాధ్యత లేదా?’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఎవరిని చెప్పుతో కొట్టాలి?
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కేసీఆర్ స్పందించలేదని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని హరీశ్‌రావు మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ గురించి మొట్టమొదలు స్పందించిందే బీఆర్ఎస్ సర్కారు అని వెల్లడించారు. 05.05.2020లో జీవో వస్తే వారంలోనే 12.05.2020నాడే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, లేఖ రాశామని వెల్లడించారు.
ఆ తర్వాత అక్టోబర్‌లో నిర్వహించిన రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లోనే కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముఖంమీద రాయలసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని కేసీఆర్ కరాఖండిగా తేల్చిచెప్పారని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన మీటింగ్ మినిట్స్‌ను హరీశ్‌రావు ఈ సందర్భంగా చదివి వినిపించారు.
అక్కడితో ఆగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తీసుకొచ్చామని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకున్నామని తెలిపారు. ప్రాజెక్టులు ఇచ్చిందెవరు? ఇప్పుడు ఎవరిని ఎవరు చెప్పులతో కొట్టాలో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము సంస్కారవంతంగా మాట్లాడుతున్నామని, ప్రజల కోసం నిలబడతామని, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, ఎకడా రాజీపడబోమని తేల్చిచెప్పారు.
ఉత్తమ్.. ఉద్యమంలో ఎక్కడున్నవ్?
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే నీటిపంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగలేదని సాగునీటిశాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి అనడం సిగ్గుచేటని హరీశ్‌రావు మండిపడ్డారు. మరి తెలంగాణ ఉద్యమానికి కారణమే నీళ్లు కాదా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమాన్ని, ప్రొఫెసర్ జయశంకర్‌సార్‌ను, అమరుల త్యాగాలను కించపరిచేవిధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. అసలు ఉద్యమ సమయంలో ఉత్తమ్‌కుమార్ ఎక్కడున్నారని నిలదీశారు. నల్లగొండను ముంచి రాజశేఖర్‌రెడ్డి పులిచింత కడుతుంటే పోలీస్ పహారాలో ఆ పనులను చేయించే పనిలో ఉత్తమ్ ఉన్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలిస్తే, వాటిని సవరించి, తెలంగాణ నీళ్లను పంట పొలాలకు తరలించిన ఘనత కేసీఆర్‌ది అని వెల్లడించారు.
చర్చకు సిద్ధం.. ప్రిపేర్ అయ్యి రండి..
ప్రాజెక్టుల అప్పగింత అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిందని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సబ్జెక్ట్ లేక సీఎం గాయ్ గత్తర చేస్తున్నారని, విషయం లేక విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తమకంటే బాగా పనిచేయాలని కోరుకుంటున్నామని, 420 హామీలు చెప్పిన సమయానికి అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.
కానీ రేవంత్‌రెడ్డి పట్టపగలు అబద్ధాలు మాట్లాడుతూ, ఆ పునాదుల మీద ప్రభుత్వాలను నడపాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బూతులతో బుల్డోజ్ చేయాలని ప్రయత్నం చేస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌కు హరీశ్‌రావు ప్రతిసవాల్ విసిరారు. సీఎం ప్రిపేర్ కాక ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారని, అసెంబ్లీకైనా ప్రిపేర్ అయి రావాలని చురకలంటించారు.
గతంలో లాగా కాకుండా కట్ చేయకుండా మైకివ్వాలని సవాల్ విసిరారు. అడిగే ప్రతిదానికి తప్పకుండా సమాధానం చెప్తామని ఉద్ఘాటించారు. అసెంబ్లీలో చర్చ చేస్తే మంచి చెడూ అన్నీ తెలుస్తాయని వివరించారు. ప్రాజెక్టులను తీసుకోవద్దని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను బీఆర్ఎస్ ఎంపీలు కలిసి కోరితే ఆ చర్చ అయిపోయిందంటున్నారని వివరించారు. అయినా పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్పడం సరికాదని, ప్రభుత్వాన్ని పక్కాగా నిలదీస్తామని తెలిపారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అఖిలపక్షాన్ని తీసుకువెళ్తే తాము కూడా వస్తామని వెల్లడించారు. తప్పు జరిగితే తెలంగాణకు క్షమాపణ చెప్పాలని, బేషజాలకు పోకుండా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండు నెలలుగా ఏం చేస్తున్నరు?
శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో, నాగార్జునసాగర్ తెలంగాణ ఆధీనంలో ఉండాలని గతంలోనే నిర్ణయించారని హరీశ్‌రావు వెల్లడించారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటికీ ఏపీ ఆధీనంలోనే ఉన్నదని, కానీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉన్నదని హరీశ్‌రావు వివరించారు.
మరుసటి రోజు పోలింగ్ అనగా కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అప్రజాస్వామికంగా సాయుధబలగాలతో వచ్చి ప్రాజెక్టును ఆక్రమించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నదని, ప్రాజెక్టును స్వాధీనం చేసుకోకుండా ఏం చేస్తున్నదని నిలదీశారు. కేంద్రమంత్రిని కలిసి సందర్భంలో ఎందుకు ఈ విషయంపై మాట్లాడలేదని, ఆ బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులను మన ప్రాజెక్టుపై పోకుండా సీఆర్పీఎఫ్ అడ్డుకుంటుంటే ఏం చేస్తున్నారని, అది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
పోతిరెడ్డి విస్తరణ నిర్ణయానికి 3 నెలల ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మేం తెగదెంపులు చేసుకున్నాం. 610జీవో అమలు చేయడం లేదని, తెలంగాణను ముంచి పులిచింతలను కడుతున్నారని, తెలంగాణ ప్రాంతానికి వైఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, ఎన్కౌంటర్లు చేస్తున్నారని నిరసనగా రాజీనామాలు చేశాం.
– హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం బుకాయిస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు పెట్టిందని నిప్పులు చెరిగారు. పదేండ్లు అధికారంలో ఉన్నా తాము ఎప్పుడూ ప్రాజెక్టుల అప్పగింతకు ఆమోదం తెలపలేదని, కేంద్రానికి అప్పగించలేదని, కానీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారు ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి రాష్ర్టాన్ని అడుకుతినే దుస్థితికి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రం, జాతి భవిష్యత్తును తాకట్టు పెట్టవద్దని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా గత ప్రభుత్వమే ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకొన్నదని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 16, 17వ కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్స్‌ను అందుకు ఉదహరిస్తున్నారని, అది పూర్తిగా అవాస్తమని తీవ్రంగా ఖండించారు.
గత ప్రభుత్వం ఎప్పుడూ ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ఆయా బోర్డు సమావేశ మినిట్స్‌లోనే అది ఉన్నదని, వాటిని చదివి వినిపించారు. ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని అపెక్స్ కౌన్సిల్‌కు రెఫర్ చేయాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కరాఖండిగా తేల్చిచెప్పిందని గుర్తుచేశారు.
అయినప్పటికీ వాటిని మరుగునపరచి సీఎం పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. సీఎం మాటలు పూర్తిగా అవాస్తమని, జర్నలిస్టులు కూడా చెక్ చేసుకుని రాయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కృష్ణాబోర్డు 17వ సమావేశంలో ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకొంటూ కేసీఆరే స్వయంగా సంతకం పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ సమావేశానికి అసలు కేసీఆరే హాజరుకాలేదని, మరి సంతకాలు ఎలా పెడతారని నిలదీశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంసారం లేని భాష, వికారమైన ధోరణి తప్ప మరేమీ లేదు. విద్యుత్తు ప్రాజెక్టుల అప్పగింతకే అభ్యంతరం తెలిపారంటే మిగతా ప్రాజెక్టుల ఔట్లెట్ల అప్పగింతకు సమ్మతం తెలిపినట్టు కాదా?. నాడు గడ్డిపోచల్లాగా పదవులు వదులుకున్నాం. నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సహచర మంత్రులే పదవుల కోసం నాడు పెదవులు మూసుకున్నారు.
-హరీశ్‌రావు