కృష్ణా నదిలో 1020 టీఎంసీలు వస్తే 34శాతం వాటా ప్రకారం కూడా వాడాల్సిన నీళ్లను వాడలేదు. కానీ ప్రగతి భవన్లో చంద్రబాబు నాయుడుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి, గురుదక్షిణ కింద తెలంగాణకు రావాల్సిన 80 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆంధ్రాకు అప్పగించిండ్రు. అసలు ఆంధ్రాకు 80 టీఎంసీలు అదనంగా నీళ్లివ్వడమేమిటి? ఇప్పుడు 34 శాతం నీటి వాటా గురించి మాట్లాడుతున్నరు. మరి ఉన్న నీటిని వాడే తెలివి ఎందుకు లేదు?
– అసెంబ్లీలో హరీశ్ నిప్పులు
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన సలహా లెటర్ తమ వద్ద ఉన్నదని.. దాన్ని ఉత్తమ్‌కు చూపిస్తానని, తాను చెప్పేది నిజమైతే మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షమాపణ చెప్తారా? అని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు నిలదీశారు. బుధవారం అసెంబ్లీలో ఇరిగేషన్ పద్దులపై హరీశ్ మాట్లాడారు. ఇరిగేషన్‌పై మాట్లాడేందుకు తమకు పూర్తిగా అవకాశమివ్వలేదని వాపోయారు. ఇరిగేషన్ విషయంలో తమపై స్వీపింగ్ రిమార్స్ చేశారని మండిపడ్డారు. వాటిపై స్పష్టత ఇచ్చి రికార్డును సెట్ చేసే బాధ్యత తమపై ఉన్నదని స్పష్టంచేశారు. ఇరిగేషన్‌పై చిన్న చర్చ అయినా పెట్టి ప్రజలకు నిజానిజాలు తెలపాలని సూచించారు. ‘మంత్రి ఉత్తమ్‌కు ఆవేశం తగదు.. అసత్యాలను మీరు గంటలు గంటలు చెప్పినా వాస్తవాలను చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నం’ అని స్పష్టం చేశారు. ‘నిరుడు ఇరిగేషన్ పద్దుల్లో కొత్తగా 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తం.. ఆరు లక్షల ఎకరాల అయకట్టుకు నీళ్లిస్తమని చెప్పిండ్రు. కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు కట్టిండ్రు? ఎన్నెకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చిండ్రో మంత్రి ఉత్తమ్ స్పష్టత ఇవ్వా లి’ అని డిమాండ్ చేశారు.
కృష్ణా వాటా వాడకంలో కాంగ్రెస్ చేతగాని తనం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ముందు సరిగ్గా వాదనలు వినిపించకపోవడం వల్ల కృష్ణా నదిలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రాకు కేటాయించిందని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కేంద్రం, ట్రిబ్యునల్ వద్దకు వెళ్లినట్టు గుర్తుచేశారు. అప్పుడవి తాతాలిక కేటాయింపులేనని చెప్పారని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కృష్ణాలో 1,020 టీఎంసీల నీళ్లు వచ్చాయని వెల్లడించారు. 66:34 ప్రతిపాదనల ప్రకారం తెలంగాణకు 346 టీఎంసీలు రావాల్సి ఉన్నదని.. కానీ ఈ ప్రభుత్వం 266 టీఎంసీలనే వాడిందని మండిపడ్డారు. తెలంగాణకు 34 శాతం కేటాయింపులు ఉంటే కేవలం 27% నీటినే వాడుకున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల తెలంగాణ కృష్ణా వాటాను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీఎస్లో 15.9 టీఎంసీలుంటే 5.65 టీఎంసీలే వాడారని, భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కింద 20 టీఎంసీల నీటి అలకేషన్ ఉంటే కేవలం 8.63 టీఎంసీలే వాడారని మండిపడ్డారు.
మేడిగడ్డ బరాజ్ వద్దని సీడబ్ల్యూసీ చెప్పలేదు
‘మీకు సరిపడా నీళ్లు లేవు కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాలని సీడబ్ల్యూసీ ఇచ్చిన లెటర్ మా దగ్గర ఉన్నది. నేను చెప్పింది నిజమైతే ఉత్తమ్ క్షమాపణ చెప్పాలె. ఒక వేళ మంత్రి చెప్పిందే నిజమైతే నేను క్షమాపణ చెప్తా’ అని హరీశ్ సవాల్ విసిరారు. ఫైవ్‌మెన్ కమిటీ రిపోర్ట్ మేడిగడ్డ వద్ద బారాజ్ కట్టొద్దు అని చెప్పినట్టు మంత్రి ఉత్తమ్ చెప్తున్నారని, ఆ కమిటీ మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ లిఫ్ట్ సాధ్యం కాదని మాత్రమే చెప్పిందని స్పష్టంచేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ కట్టొద్దని ఫైవ్ మెన్ కమిటీ చెప్పలేదని వివరించారు. ‘పోతిరెడ్డిపాడు కట్టిన నాడు మా మంత్రి పదవులను త్యాగం చేసి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసినం. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకుపోతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలు లేవని స్పష్టంగా సీడబ్ల్యూసీ చెప్పిందని, కట్ మోషన్స్పై మంత్రి స్పష్టమైన సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్న సా గర్ నిర్వాసితులకు రూ.1,260 కోట్లను తామే చెల్లించామని, కోర్టు ఆర్డర్ల ద్వారా దాదాపు రూ.200 కోట్లు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల ప్రాజెక్టుల కింద కాలువల నిర్మాణం కాకపోవడం వల్ల ఆయకట్టు రావడం లేదని, ఆ కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తారా? లేదా? చెప్పాలని నిలదీశారు.
బీజేపీ సభ్యుల మాటలను ఖండిస్తున్నం
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. శాసనసభలో బీజేపీ సభ్యుల మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సెంట్రల్ వాటర్ కమిషన్ కాళేళ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఒక వేళ తమ్మడిహట్టి వద్ద నీళ్లు ఉండి ఉంటే తమకు కాళేశ్వరం కట్టుకోడానికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం సరైంది కాకపోతే ఆ రోజు ప్రాజెక్టుకు 16 మంది సీడబ్ల్యూసీ డైరెక్టరేట్లు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీశారు.
చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా నీళ్లు
అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేదని హరీశ్ చెప్పారు. కృష్ణాలో మన తాత్కాలిక కేటాయింపు 34 శాతమని, ఈ నీళ్లను కూడా వాడలేక పోయిన దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్లో చంద్రబాబు నాయుడుకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికి గురుదక్షిణగా తెలంగాణకు రావాల్సిన 80 టీఎంసీల కృష్ణా నీటిని ఆంధ్రాకు అప్పగించారని దుమ్మెత్తిపోశారు. ఓవైపు తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే ఆంధ్రాకు 80 టీఎస్సీల నీటిని అదనంగా ఎలా ఇస్తారని మండిపడ్డారు. కృష్ణాలో 80 టీఎంసీలు తక్కువగా వాడి, ఆంధ్రాకు అప్పజెప్పి.. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు. ఈ విషయంపై సభలో మాట్లాడుదామంటే మైకు ఇవ్వకుండా పూర్తిగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సభ జరిగిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.