Harish Rao | రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పేది నిజమైతే రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లి రైతులను అడుగుదామని సవాలు విసిరారు. ప్లేస్, టైమ్ చెబితే అక్కడకు వెళ్లి ఖుల్లాం ఖుల్లా రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు.
చెప్పేటోనికి చెవుడు అయినా.. వినేటోడికి అయినా వివేకం ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. కేబినెట్లో 31వేల కోట్లు అని చెప్పి.. 17వేల కోట్లు ఇచ్చి రుణమాఫీ చేశామని అంటే.. అది ప్రజలను, రైతులను, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడమే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 36లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు. రుణమాఫీకి 17వేల కోట్లు ఖర్చయ్యిందని పేర్కొన్నారు. ఇప్పుడు రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా? తగ్గుతుందా? అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది లబ్ధి పొందారని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. 14 లక్షల మంది రైతులు ఎలా తగ్గుతారని ప్రశ్నించారు. లక్ష రుణమాఫీ చేస్తేనే 36 లక్షల మంది రైతులు ఉన్నప్పుడు.. రెండు లక్షల రుణమాఫీ చేస్తే 47 లక్షల మంది అయినా ఉండాలి కదా అని నిలదీశారు. ఎవరి మభ్యపెడుతున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు.
పట్టపగలు నట్టనడి బజారులో నిట్టనిలువున ముంచి రైతులను ముంచి పరేషాన్ చేశారని హరీశ్‌రావు మండిపడ్డారు. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరిగిందంటే.. ప్లేస్ చెప్పు.. టైమ్ చెప్పు.. ఏ జిల్లాకు పోదాం.. ఏ మండలానికి పోదాం.. ఏ గ్రామానికి పోదాం.. నువ్వు చెప్పు.. నేను వస్తా.. నా నియోజకవర్గానికి వస్తావా? నీ నియోజకవర్గానికి పోదామా? రాష్ట్రంలో ఎక్కడికి పోదామో నువ్వే డిసైడ్ చేయ్యి.. అక్కడికి వెళ్లి ఆ ఊరి రైతులను అడుగుదాం.. ఖుల్లాం ఖుల్లా రుణమాఫీ అయ్యిందో లేదో తేల్చేద్దామని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాలు విసిరారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రుణమాఫీ కాదని అన్నారు. ఏ ఊరికైనా వెళ్లి రుణమాఫీ సంపూర్ణంగా అయ్యిందో కాలేదో అడుగుదామని చెప్పారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి పీఏఎసీఎస్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 487 మంది ఉన్నారని.. కానీ మూడు విడతల్లో 192 మందికే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. రుణమాఫీకి కావాల్సిన డబ్బు 6కోట్లు అయితే 1.38 కోట్లు మాత్రమే మాఫీ అయ్యిందని చెప్పారు.. ఇది రుణమాఫీ అయినట్లా అని ప్రశ్నించారు. సిద్దిపేట నియోజకవర్గంలో తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి 720 మంది రైతులు అర్హులు ఉంటే.. మూడు విడతల్లో 355 మందికే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. బక్రిచెప్యాల, వెల్గటూర్‌లో రుణమాఫీకి అర్హులైన రైతులు 620 ఉంటే.. 320 మందికే మాఫీ అయ్యిందని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేటలో 632 మంది రైతులు ఉంటే.. కేవలం 14 మందికే రుణమాఫీ జరిగిందని అన్నారు. ఇది రుణమాఫీ అయినట్లా అని ప్రశ్నించారు.
రుణమాఫీ కాని రైతులు ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ భవన్లో ఒక కాల్ సెంటర్ పెట్టామని హరీశ్‌రావు తెలిపారు. దానికి రుణమాఫీ కాలేదని 1,16,441 ఫోన్లు వచ్చాయని చెప్పారు. ఇంత స్పష్టంగా రాష్ట్రంలోని రైతులు తమకు రుణమాఫీ కాలేదని అంటే.. రేవంత్ రెడ్డి మాత్రం అయిపోయిందని చెబుతున్నారని మండిపడ్డారు.