Harish Rao | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ‘ఏం చేస్తారో నాకు తెల్వదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తాలి. అవి దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్నయి. వాటిని తక్షణం పూర్తి చే యాలి’ అని పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడే కేసీఆర్ తమను ఆదేశించారని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఇచ్చిన పవర్ పా యింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ తాను, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జూ పల్లి కృష్ణారావు నాడు మంత్రులుగా పాలమూ రు పెండింగ్ ప్రాజెక్టుల పర్యటన చేశామని చెప్పారు.‘జొన్నలబొగుడ అనే రిజర్వాయర్ పంప్ హౌస్ ఏండ్ల తరబడి కూలిపోయి అలాగే ఉన్నదని గ్రహించినం.
ఆ పంప్ హౌస్ కూలిపోతే ఎవ్వరూ దాన్ని బాగు చేయించలే. ఆ తర్వాత ఆ రాత్రంతా ఆ పంప్‌హౌస్‌ల వద్ద నేలమీద పడుకొని, అధికారులతో రివ్యూ చేసి, అధికారులను పరుగెత్తించి వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినం. 6 లక్షల 50 వేల ఎకరాలకు (పాలమూరులో) నీళ్లు అందించినం’ వివరించారు. ‘ఆవంచ దగ్గర వాగుపై ఎండల్లో తిరిగి, అక్కడే ఉండి ఇంజినీర్లు, కాం ట్రాక్టర్‌ను కూర్చోబెట్టి మాట్లాడినం.. ఆ రోజు నిరంజన్ వాళ్ల ఇంటి డాబాపై పడుకొని అధికారుల వెంటబడి ఒక్క సీజన్లోనే అక్వాడెక్ట్ కట్టాం. కల్వకుర్తిలోనే 3 లక్షల 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్’ అని స్పష్టంచేశారు.

కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తుతున్న దశలో కేసీఆర్ తెలంగాణకు 50:50 నిష్పత్తిలో నీటి వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు హరీ శ్ చెప్పారు. ‘మాకు ఇప్పటి వరకూ 34:66 ఇస్తున్నారు. ఏమైనా అంటే ట్రిబ్యునల్ అవా ర్డు, తాత్కాలిక అరెంజ్మెంట్ అంటున్నారు. ఇది ఇక నడ్వది. ఎట్టి పరిస్థితుల్లో మాకు 50:50 నిష్పత్తిలో వాటా ఇవ్వాల్సిందే’ అని 2017-18లోనే కేసీఆర్ పట్టుబట్టారని చెప్పా రు. ఆ తర్వాత కూడా కేఆర్ఎంబీకి 28 లేఖలు రాసినట్టు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ 299 టీఎంసీలు రాసిచ్చిందని, పాలమూరుకు మరణశాసనం రాసిందని సీఎం చిల్లర మాటలు మాట్లాడుతున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 299 టీఎంసీలకు కేసీఆర్ ఒప్పుకొంటే ట్రిబ్యునల్ వేయాలని అపెక్స్ కౌన్సిల్ ఎందుకు అడుగుతారని, ‘ఆ నాడు మేము అలా రాస్తే 50:50 ఇవ్వాలని 28 లేఖలు రాస్తారని? ప్రశ్నించారు. కేంద్రంపై పోరాడి, ప్రధానికి లేఖలు రాసి కేంద్రం మెడలు వంచి, ఒప్పించి ఇవ్వాళ కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్-3ని సాధించారని, సీఎం చెప్పింది పూర్తి అబద్ధమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
అంతేకాదు 2023లో పోరాడి 66:34 నిష్పత్తి ప్రతిపాదన లేకుండానే కేఆర్ఎంబీ 17వ సమావేశంలో అగ్రిమెంట్ చేశామని, ఆ నీటివాటాకు శాశ్వత ముగింపు పలికారని హరీశ్ చెప్పారు. 2020లో కేసీఆర్ పర్మినెంట్‌గా రాసిచ్చారనే రేవంత్ ఆరోపణల్లో వాస్త వం లేదని స్పష్టంచేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ కేవలం 66:34 కోసం పోరాడిందని, దీంతో కథ మొత్తం మొదటికి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 19వ కేఆర్ఎంబీ మీటింగ్‌లో ఇదే పాత నిష్పత్తికి తలొగ్గిందని తెలిపారు. ‘2024-25 వాటర్ ఇయర్ కోసం మళ్లీ 66:34 నిష్పత్తికే అంగీకరించడం రేవంత్ సర్కార్ చేతగాని తనానికి నిదర్శనం. తన చారిత్రక తప్పిదన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని బీఆర్ఎస్ మీదకు నెట్టాలని చూస్తున్నడు. ఇది కాంగ్రెస్ అతి తెలివికి నిదర్శనం’ అని నిప్పులు చెరిగారు.
సెక్షన్-3 కింద కృష్ణాజలాల పునః పంపిణీని సాధించింది కేసీఆర్. మొదటి, రెండో అపెక్స్ కౌన్సిళ్లలో కొట్లాడి, సుప్రీంకోర్టుకు వెళ్లి, కేంద్రం మెడలు వంచి కేసీఆర్ సెక్షన్-3 తెచ్చిండు. ఇంకో ఆరు నెలల్లో సెక్షన్ 3 కింద మన రాష్ర్టానికి తక్కువలో తక్కువ 500-600 టీఎంసీల నీళ్లు వస్తయి. అదీ ఆయన చూపిన శాశ్వత పరిష్కారం.
– హరీశ్‌రావు

తెలంగాణకు నీటి వాటా 71 శాతం రావాలని, ట్రిబ్యునల్‌లో కొడ్లాడుతున్నామని మంత్రి ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు డ్రామా చేస్తున్నారని హరీశ్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారం సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని అప్పుడే లేఖలు రాసిండు. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ లేఖలు రాస్తే దాన్ని మీరు కొత్తగా కనిపెట్టామని బిల్డప్ ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2023 వరకు సెక్షన్-3 కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా కేంద్రానికి 32 లేఖలు రాసిందని, అవే కేసీఆర్ రాజీలేని పోరాటానికి సజీవ సాక్ష్యాలని చెప్పారు.
కేంద్రం స్పందించకుంటే సుప్రీం కోర్టు గడపతొక్కారని, 2020 అక్టోబర్‌లో నిర్వహించిన రెండో అపెక్స్ కౌన్సిల్లోనూ ఇదే అంశంపై కేసీఆర్ పట్టుబట్టారని చెప్పారు. సుప్రీంలో కేసు వాపస్ తీసుకుంటేనే ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం హామీనిస్తే 2021లో విత్‌డ్రా చేసుకున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలు నిలదీస్తారనే భయంతో, కేసీఆర్ ఒత్తిడితో 2023 అక్టోబర్ 6న సెక్షన్-3ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది’ అని హరీశ్ వివరించారు. ఈ విషయాలను బట్టి కేసీఆర్ ఎంతగా పోరాడారో అర్థమవుతుందని, సెక్షన్-3 అమలులో కేంద్రం ఎంతలా తీవ్ర జాప్యం చేసిందో తెలుస్తుందని చెప్పారు.
‘నాడు కేంద్రం ఇస్తామన్న 299 టీఎంసీలు మనకు ఎటూ సరిపోవు. ఆ నీళ్లతోనే మనవాళ్లు బతకలేరు. ఆ నీళ్లతోనే పాలమూరు, డిండి నిర్మించాలనంటే ఇబ్బంది. కృష్ణా నదీ పరివాహకంలో ఉన్న నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మంలకు నీళ్లు రావాలంటే సెక్షన్ 3 కింద కృష్ణా నుంచి 600 టీఎంసీలు తీసుకురావాలి. అందుకే నీటి కోసమే నిజాయితీ, నిబద్ధతతో కేసీఆర్ పోరాటం చేసిండ్రు. నాటి నుంచి ఆయన ప్రయత్నాలు, రాసిన లేఖలు, వేసిన కేసులు, వచ్చిన గెజిట్ నోటిఫికేషన్లే ప్రధాన సజీవ సాక్ష్యాలు.
ఇదీ కేసీఆర్ ఘనత’ అంటూ అభివర్ణించారు. ఓవైపు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. మన అధికారులెవరో తెలియదు. ఎక్కడ కూర్చోవాలో తెలియదు. సెక్రటేరియట్లో అప్పటికే కుర్చీల పంచాయతీ నడుస్తున్నది. అయినా కేసీఆర్ ఫోకస్ నీటి మీదనే ఉన్నది. ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని పోరాడిండ్రు. ఇన్ని లేఖలు చూసిన తర్వాత కూడా మెడమీద తలకాయ ఉన్నోడు ఎవడైనా కేసీఆర్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యా యం చేశాడంటే నమ్ముతారా? ఇవి పిచ్చిమాటలు కాకపోతే ఏంది?’ అని హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు బీఆర్ఎస్ పోరాటాల ఫలితంగానే కేంద్రం సెక్షన్-3కి ఆమోదం తెలిపితే దాన్ని పట్టుకొనే కదా నువ్వీరోజు ట్రిబ్యునల్‌లో వాదిస్తున్నవ్. నాడు ఆయన పోరాటం లేకపోతే కాంగ్రెస్ రాసిన మరణశాసనమే తెలంగాణకు శాపమయ్యేది. ఆ శాపం నుంచి కేసీఆర్ తెలంగాణను బయటికి తెచ్చి కృష్ణాలో 600 టీఎంసీలు రావడానికి కృషి చేసిండ్రు. తెలంగాణ రావడానికి ఎంత కృషి చేసిండ్రో.. సెక్షన్-3 రావాడానికీ అంతే కృషి చేసిండ్రు. అంత మేలు చేసిన నాయకుడు కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తాడా?
-హరీశ్‌రావు
అసెంబ్లీలో పీపీటీ ఇస్తూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 286 టీఎంసీల నీళ్లు నియోగించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని హరీశ్ విమర్శించారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణానదిలో అతి తక్కువ నీటి వినియోగం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 2024-25లో అది స్పష్టమైంది. నదుల్లోకి నీళ్లు ఎంత వచ్చినయ్? అందులో తెలంగాణ ఎంత వాడుకున్నది? ఆంధ్రా ఎంత వాడుకున్నది? అనేది లెక్క. కాగా 2024-25లో ఏపీ నీటి వినియోగం 71.51 శాతానికి చేరితే తెలంగాణ కేవలం 28.49 శాతానికే పరిమితమైంది’ అని వివరించారు. గడిచిన 11 ఏండ్లలో ఇంత తక్కువ స్థాయిలో నీటిని వినియోగించుకోవడం ఇదే తొలిసారి అని చెప్పారు.
ఇది తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన మరో ద్రోహమని అభివర్ణించారు. దీనిని దాచిపెట్టి 286 టీఎంసీలు అని చెప్పారని, కానీ ఏపీ 718 టీఎంసీలు చూపిస్తున్నదని, దాన్ని ఎందుకు పీపీటీలో చూపించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు పూటకో మాట.. గడియకో లెక్క చెప్తున్నారని, నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రికి కనీస అవగాహన లేదని, వారు తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారని మనం ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల పది రోజుల్లోనే మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందని, నాడు నల్లగొండ వేదికగా కేసీఆర్ గర్జనతో వెనకడుగు వేసిందని గుర్తుచేశారు. ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ యూటర్న్ తీసుకున్నదని, అసెంబ్లీలోనూ తీర్మానం చేశారని బీఆర్ఎస్ ఒత్తిడితోనే అది సాధ్యమైందని, ఆ ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టులు అప్పగించిందని, కృష్ణా నదిలో అతి తక్కువ నీటిని వినియోగించిందని, 66:34కు మళ్లీ ఒప్పందం చేసుకున్నదని ధ్మజమెత్తారు.