కరీంనగర్, మార్చి 20 (నమస్తే తెలంగాణప్రతినిధి) : బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. చెప్పేమాటలకు, కేటాయింపులకు ఏ మాత్రం పొంతన లేదని ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు కేటాయింపులు చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
గతేడాది బడ్జెట్లో జరిగిన అన్యాయమే ఈ సారి కూడా జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలంటే అంత వివక్ష ఎందుకని, మ్యానిఫెస్టోను మరువడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. ఓవైపు బీసీలకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామంటూనే మరోవైపు కేటాయింపుల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న మాటలు.. ఆచరణలో జరుగుతున్న కేటాయింపులు, తద్వారా బీసీ సమాజానికి జరిగే అన్యాయాన్ని పూర్తి స్థాయిలో బీసీ లోకం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క విషయాన్ని ఇప్పటి వరకు చట్టబద్ధంగా ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ 25ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా సన్నాహాక సమావేశాన్ని ఈనెల 23న కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని తెలిపారు.