MLA Chinta Prabhaker | సంగారెడ్డి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను సంగారెడ్డి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ పాలనలో సంగారెడ్డిలో హరీష్ రావు చేసిన అభివృద్ధికి ప్రజలు రుణపడి ఉన్నారు. దానికి నిదర్శనమే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఆయన పేర్కొన్నారు.
హరీష్ రావు వ్యక్తిత్వం గురించి నైతిక విలువలు లేని మనుషులు మాట్లాడం సిగ్గు చేటు. హరీష్ రావు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు తప్ప మీ లాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడరు. మోసపూరిత హామీలతో అబద్ధాల మాటలతో గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలను మించిన వారు లేరు అని చింతా ప్రభాకర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి. ఇకనైనా ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగ్గట్లు వ్యవహరిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై దృష్టిపెట్టాలని మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. రేవంత్ రెడ్డికి బేసిన్ల మీద నాలెడ్జి లేదు.. మహేష్ కుమార్ గౌడ్‌కు ఇరిగేషన్ మీద బేసిక్ నాలెడ్జ్ లేదు. బనకచర్ల ప్రాజెక్టు మీద బిఆర్ఎస్ మాట్లాడుతుంటే మహేష్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా బనకచర్ల ప్రాజెక్టు కట్టడం అయ్యింది ఆంధ్రా ప్రాంతంలో అంటున్నాడు. ఇలాంటి నేతలేనా తెలంగాణ హక్కులను కాపాడేది అని చింతా ప్రభాకర్ మండిపడ్డారు.