BRS | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆత్మవిశ్వాసానికి, స్వీయ క్రమశిక్షణకు బీఆర్ఎస్ ప్రతిరూపమని మరోసారి నిరూపితమైంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మాటే శాసనం.. నిర్ణయమే శిరోధార్యం అన్నది తేటతెల్లమైంది. ఒక్కటికాదు.. రెండు కాదు.. ఏకంగా రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా ఎక్కడా అసంతృప్తి జాడ కనిపించలేదు. టికెట్ దక్కినవారికి దక్కనివారు సంపూర్ణ సహకారం అందించి ఐక్యతా చేతనానికి బీఆర్ఎస్ ప్రతిరూపమని చాటారు. అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత బీఆర్ఎస్లో భూకంపం వస్తుందని, ఆశావహులు, టికెట్ రానివాళ్లు అసహనంతో ఊగిపోతారని ఊహించుకొన్న ప్రతిపక్షాలకు శృంగభంగం కలిగింది.
అసమ్మతులకు గాలం వేసేందుకు గోతికాడి నక్కల్లా కాచుకొని కూర్చొన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. 115 నియోజకవర్గాల్లో ఎక్కడా చెరువుకు మత్తడి పడలేదు.. చుక్కనీరు బయటికి పోలేదు. కనీసం ఊటకూడ కనిపించలేదు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వాలు దక్కించుకొన్న అభ్యర్థులు.. దక్కని ఆశావహులు రామలక్ష్మణుల్లా కలిసిపోయారు. నిండుకుండలాంటి చెరువులో చేపపిల్లల్లా చెంగున చెంగున ఎగురుతూ చెట్టాపట్టాలేసుకొని వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమైపోయారు. ‘అభ్యర్థి నువ్వా.. నేనా’ అన్నది కాదు ముఖ్యం గులాబీ జెండా ఎగిరిందా? లేదా? అన్నదే ముఖ్యం అన్నట్టుగా వ్యవహరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకట్రెండు చోట్ల తప్పా 115 నియోజకవర్గాల్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం సరైనదేనని గులాబీ శ్రేణులు తమ కార్యాచరణ ద్వారా తేల్చిచెప్పారు.

కలిసికట్టుగా గులాబీదళం
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా అన్ని స్థాయిల్లో బలమైన పునాదులున్న పార్టీగా బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. 75 నుంచి 80 లక్షల పార్టీ సభ్యత్వం ఉన్న బలమైన శక్తిగా పార్టీ అవతరించింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా రాష్ట్రంలో మిగతా ఏ పార్టీకి లేని.. ఆ మాటకొస్తే కనుచూపుమేరలో ఏ పార్టీలేని రీతిలో క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులున్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. రాష్ట్రంలో అటు పార్టీ బలం, ఇటు ప్రజాబలం జమిలీగా ఉన్న వాతావరణం గులాబీ పార్టీకి మినహా మరో పార్టీకిలేదు. ‘మంది ఎక్కువ ఉంటే మజ్జిగ పలుచన’ అన్నది బీఆర్ఎస్కు వర్తించదని, ఎంతమంది ఉన్నా మీగడ పెరుగే అందరికీ అన్నదే తమ ఆచరణ అని పార్టీ శ్రేణులు నిరూపించాయి.
ఈ నేపథ్యంలోనే అభ్యర్థిత్వం ఖరారైనవారు..కానివారు.. ఆశించినవారు.. ఆశలు నెరవేరనివారు అలా ఎంత మంది తమలో తమకు ‘భిన్నాభిప్రాయాలు ఉంటాయే తప్ప తమకు భేదాభిప్రాయాలు’ ఉండే ఆస్కారం లేదని, అందుకు అభ్యర్థుల ప్రకటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సుహృద్భావ వాతావరణమే నిదర్శమని పార్టీ టికెట్ ఆశించి, టికెట్ రాని నాయకుడు పేర్కొనడం విశేషం. ‘మంచిని మైక్‌లో చెప్తాం.. చెడును చెవులో చెప్పుకొంటాం’ కానీ ఇతర కాంగ్రెస్, బీజేపీల్లోలాగా రోడ్డెక్కి లొల్లి చేయబోమని మరోనేత పేర్కొన్నారు. మరోవైపు ‘చెరువు మీద అలిగితే.. ఎవరికి ఎండుద్ది? అనే విషయం మాకు బాగా తెలుసు. ఎవరెన్ని చేసినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే, మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. మాకేం కావాల్నో మా నాయకుడు చూసుకుంటారు’ అనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పటికీ కేసీఆర్‌కు విధేయుడినే: టీ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 22: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గీసిన గీతను దాటేది లేదని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని సూచించారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడారు. బీఆర్ఎస్లో చేరినప్పటినుంచీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను వీర విధేయుడినని పేర్కొన్నారు. తన స్థాయికి తగ్గకుండా అవకాశం కల్పిస్తానని, ఇప్పటికంటే ఉన్నతంగా చూస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు సంయమనం పాటించాలని, సీఎం ఆశీస్సులు మెండుగా ఉంటాయని తెలిపారు. అక్టోబర్ 16న నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం దేవన్నపేట గ్రామ సమీపంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని, బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేసి విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల దవాఖాన నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా చేసుకోవడం, నియోజకవర్గ కేంద్రంలో అమరవీరుల స్థూపాన్ని పూర్తి చేయాల్సి ఉన్నదని తెలిపారు.

బోథ్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురేస్తా: రాథోడ్ బాపురావ్
అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. టికెట్ రాలేదని పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. తాను ఉద్యోగం మానేసి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరానని, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించినట్టు తెలిపారు. ఉద్యమం నుంచి బీఆర్ఎస్లో ఉన్నానని, ఈ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు. తనను ఇతర పార్టీలు అహ్వానించినా తిరస్కరిస్తానని తెలిపారు. భవిష్యత్తులో మంచి స్థానం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
కట్టుదాటితే వేటే
క్రమశిక్షణ విషయంలో రాష్ట్రంలో మిగతా పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా ఏమిటో పార్టీలోని అన్ని స్థాయిల శ్రేణులకు స్పష్టంగా తెలుసునని ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు తేల్చిచెప్పాయి. పార్టీ క్రమశిక్షణ గీతదాటితే వేటు తప్పదని గతంలో అనేక సంఘటనలు నిరూపించాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించిన ఎంతోమంది అగ్రనాయకుల అడ్రస్ రాజకీయాల్లో గల్లంతైన విషయం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ సుపరిచితమే. మరోవైపు అభ్యర్థుల ప్రకటనకు ఒకరోజు ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అభ్యర్థులను ప్రకటించే సందర్భంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరిక వెరసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. మొత్తంగా కట్టుదాటితే తమ రాజకీయ జీవితమే గల్లంతవుతుందని గుర్తెరిగి బీఆర్ఎస్ శ్రేణులంతా క్రమశిక్షణతో మెలుగుతున్నాయి.