హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా మైనారిటీ డిక్లరేషన్‌లో ప్రకటించిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ధోకా చేసిందని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్‌లో పార్టీలోని ముస్లిం నాయకులెవరూ మైనారిటీల సమస్యలపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. రేవంత్ పాలనలో రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు రావాల్సిన ప్రయోజనాలు రావడం లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం పార్టీ నేతలు అబ్దుల్ కలీం, బైకాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఇంతియాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. మైనారిటీ సబ్‌ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఇమామ్, మౌజమ్‌లకు ఐదు నెలలుగా గౌరవ వేతనం అందడం లేదని ధ్వజమెత్తారు.
ఇమామ్, మౌజమ్లతోపాటు దర్గా ఖాదీమ్లకు చర్చ్ పాస్టర్ల తరహాలో ఇస్తామన్న నెలకు రూ.10-12 వేల గౌరవ వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ మైనారిటీల అంతు చూస్తామని బెదిరించినా చర్యలు తీసుకోవడం లేదని, ఇదేనా కాంగ్రెస్ విధానం అని నిలదీశారు. రేవంత్ మంత్రివర్గంలో ఒక మైనారిటీకి కూడా స్థానం కల్పించలేదని, సెక్యులర్ విలువలను కాంగ్రెస్ మంటగలుపుతున్నదని మండిపడ్డారు. మైనారిటీ గురుకులాల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో మైనారిటీలకు కేటాయించిన నిధులు ఎందుకు ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.