హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఫూలే చూపిన బాటలో పాలన సాగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిబాఫూలే 197వ జయంతి వేడుకలను మంత్రి గంగుల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. సూర్యచంద్రులు ఉన్నంత వరకూ మహాత్మా జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలేల స్ఫూర్తి వెల్లివిరుస్తుందని అన్నారు.
బాబాసాహెబ్ విగ్రహం మాదిరిగానే ఫూలే విగ్రహాన్ని సైతం హైదరాబాద్‌లో నిర్మించాలని, త్వరలో మం త్రులందరూ ఈ అంశంపై ముఖ్యమంత్రిని కలువనున్నట్టు తెలిపారు. వెనుకబడిన వర్గాలకు సమాజంలో గౌరవం దకాలంటే జ్ఞాన సంపదతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి ఫూలే అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడానికి తన భార్య సావిత్రీబాయి ఫూలేకు విద్యనందించారని గుర్తుచేశారు. ఆమెను ప్రపంచంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేసి ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. తెలంగాణలో బీసీలకు రూ.6,300 కోట్లు కేటాయి స్తే, కేంద్రం దేశవ్యాప్తంగా బీసీలకు రూ.2 వేల కోట్లతో సరిపుచ్చిందని విమర్శించారు.
బీజేపీపై పోరుకు సిద్ధం కండి: శ్రీనివాస్‌గౌడ్
బీసీ ప్రధానిని అని, బీసీల సమస్యలు తనకే ఎక్కువ తెలుసని పదేపదే చెప్పే మోదీ బీసీలకు చేసింది శూన్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బీజేపీపై ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ బీసీల అభ్యున్నతికి పాటుపడుతుంటే, మోదీ మాత్రం బీసీలను అణగదొక్కేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్వాయి పాపన్న తదితర బీసీ బిడ్డల వేడుకలను రాష్ట్ర పండుగలుగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కానీ, కేంద్రంలో మోదీ మాత్రం బీసీ గణన లేకుండా, మంత్రిత్వశాఖ ఇవ్వకుండా, రిజర్వేషన్లు అమలు చేయకుండా వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు ఉపేంద్ర, కిషోర్‌గౌడ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఫూలే ఆశయాలకు అనుగుణంగా పాలన: మంత్రి వేముల
మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని మంత్రి వేము ల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అణగారిన వర్గాలు, బహుజనుల సమగ్ర వికాసానికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. ఫూలే జయంతి సందర్భంగా మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో మంత్రి ఫూలేకు నివాళి అర్పించారు.