Assembly Session | హైదరాబాద్, జనవరి2 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇయ్య’.. ప్రశ్నలడుగుతా? అంటేనే ఇస్తా.. ప్రశ్నలు మాత్రమే అడగండి? సూచనలు, సలహాలివ్వండి. లీడర్ ఆఫ్ ది హౌస్‌ను కించపరిచేలా మాట్లాడొద్దు’ ఇవీ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు వింతపోకడలకు సాక్షీభూతాలుగా నిలిచాయి. అదే సీఎం రేవంత్‌రెడ్డి అదే సభ్యులను ఉద్దేశించి విపరీతార్థాలతో అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే మాత్రం కిమ్మనకుండా వింటూ కూర్చున్నారంటూ అదే బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పదే పదే అదే పనిగా బీఆర్ఎస్ సభ్యుల మైక్ కట్ చేస్తూ స్పీకర్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి కళంకమని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పించింది.
సీఎం రేవంత్‌రెడ్డి ఇదే సభలో అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ ఆపరా? ఆపాల్సిన బాధ్యత స్పీకర్‌కు లేదా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదు. సభా నాయకుడి వ్యాఖ్యలపై స్పందించేందుకు అవకాశం కల్పించాలని పదే పదే బీఆర్ఎస్ సభ్యులు వేడుకున్నారు. సభ్యుల రక్షణకు స్పీకర్ చొరవ చూపాలని కోరారు. ఎట్టకేలకు స్పీకర్ అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి పదే పదే మైక్ కట్‌చేస్తూ, మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. ఈ సం దర్భంగా మూసీ సుందరీకరణపై పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి కల్పించుకొని ‘కొందరి కడుపులో విషముంది.. తగ్గించుకుంటే మంచిది. వీళ్లందరినీ అనంతగిరి గుట్టల్లో వదిలేయాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం ప్రసంగం ముగించిన తర్వాత తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరారు. స్పీకర్ అందుకు నిరాకరించారు. సీఎంను విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఆఖరుకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి పదే పదే మైక్ కట్‌చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ‘సీఎం రేవంత్‌రెడ్డి’ అంటూ ప్రసంగం మొదలు పెట్టగానే స్పీకర్ మైక్ కట్‌చేశారు. కించపరిచేలా చేయొద్దు.. సభా గౌరవాన్ని కాపాడాలంటూ స్పీకర్‌ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి కోరారు. అంతకు ముందు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడినప్పుడు స్పీకర్ పలుమార్లు మైక్ కట్‌చేశారు. దీంతో ఈ సభలో ఉండమంటారా? లేదా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ప్రశ్నించారు. ఉండమంటే ఉంటం. లేదంటే వెళ్లిపోతాం అంటూ గట్టిగా (మైక్‌లో కాదు) అరిచారు. అయినా స్పీకర్ అవకాశం కల్పించకపోవడం, ఎజెండాను చేపట్టడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. చర్చను బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశారు.
అసెంబ్లీ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? మినిట్స్‌లో ఉన్నదేమిటి? అంటూ హరీశ్‌రావు ప్రశ్నించారు. సభను ఏడు రోజులు నడిపించాలని బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించాం. అవసరమైతే మళ్లీ సమావేశమై తదుపరి ఎన్ని రోజులు నడపాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్న అంశాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కానీ బీఏసీ మినిట్స్‌లో ఏడు రోజులు సభను జరుపుతామని ఎక్కడా లేదని, బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వేరు.. మినిట్స్‌లో ఉన్నది వేరని నిలదీశారు. దీనిపై సభా వ్యవహారాల మంత్రి వివరణ ఇవ్వాలని, మినిట్స్‌ను సరిదిద్దాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సభ ఎజెండా (బిజినెస్) తెల్లవారుజామున మూడు గంటలకు, ఉదయం రెండు గంటలకు సభ్యులకు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలా అయితే సభ్యులు ఎలా ప్రిపేర్ కాగలరు? చర్చలో ఎలా పాల్గొనగలరు? అంటూ నిలదీశారు. అసెంబ్లీని నడిపే పద్ధతి ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ఎజెండాను 24గంటల ముందుగా పంపించడం నేర్చుకోవాలని సూచించారు.
కడుపులో విషం మాకున్నదా? మీకున్నదా? అసలు సభను నడిపించే పద్ధతి ఇదేనా? అంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికార పక్షాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రికి అంత ఆవేశమెందుకు? సీఎం స్థాయిలో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి. స్పీకర్ ప్రతిపక్ష సభ్యుల హక్కులను కాపాడాలి. ప్రతిపక్షం నుంచి ఎవరైనా సీఎంను కించపరిచినట్టు మాట్లాడితే నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రశ్నోత్తరాల్లో ఒక ప్రశ్నకు ఇంత సమయం ఇవ్వడమేమిటి? అవసరమైతే స్వల్పకాలిక చర్చను చేపట్టాలని మాత్రమే మేం సూచించాం. ఇది కూడా తప్పేనా? ‘మీ కడుపులో విషముంది.. మిమ్మల్ని తీసుకెళ్లి అనంతగిరి అడవుల్లో వదిలేయాలనడం’ సబబేనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
‘మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపే ఎక్కువగా ఉన్నది’ అని హరీశ్‌రావు విమర్శించారు. ఆయన మాటలు వినడానికి కష్టంగా ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడితే స్పీకర్ ఆపరా? అంటూ ప్రశ్నించారు. ‘ఈ సభలో సభ్యులందరికీ సమానమైన హక్కులుంటాయి. స్పీకరే ఈ సభకు కస్టోడియన్.. ప్రతిపక్ష సభ్యల హక్కుల రక్షణకు స్పీకర్ ముందురావాలి’ అని కోరారు. ఈ సందర్భంగా స్పీకర్, హరీశ్‌రావు మధ్య వాదనలు నడిచాయి. ‘మేం అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేయలేదు. మాకు మాట్లాడే అవకాశం కల్పించాలి’ అని హరీశ్‌రావు కోరారు. తాము అడిగిన ప్రశ్నపై ఇతర సభ్యలకు అవకాశం కల్పించి మాకెందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కల్పించుకొని శాసనసభా వ్యవహారాల మంత్రి వివరణ ఇచ్చారనగా, వివరణ ఇవ్వలేదని హరీశ్‌రావు తోసిపుచ్చారు. తమ వాదనలను వినాలని స్పీకర్‌ను కోరారు. మైక్ ఇవ్వకపోవడం, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడమంటే ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడమేనని ధ్వజమెత్తారు. ప్రశ్నోత్తరాల్లో నిరసన తెలుపడం ప్రతిపక్షాల హక్కు, రూల్ బుక్‌లోనూ ఈ విషయం స్పష్టంగా ఉన్నది. తమకు నిరసన తెలిపే అవకాశం కల్పించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. స్పీకర్ ప్రతిపక్ష సభ్యుల వైపు చూడకపోవడం, మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం సబబుకాదని సూచించారు.