హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ప్రజాపద్దుల కమిటీ తొలి సమావేశం రసాభాసగా మారింది. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ నియామకంపై బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను నిలదీశారు. చైర్మన్‌ను ఎలక్షన్ ద్వారానా? లేక సెలెక్షన్ ద్వారా ఎంపికా చేశారా అని ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తి చెప్పి ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించకుండా చైర్మన్‌ను ఎలా ఎంపిక చేశారని మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగారు. అరికెపూడి గాంధీని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని ప్రశ్నించారు. తమకు సమాధానం చెప్పిన తరువాతనే సమావేశాన్ని కొనసాగించాలని పట్టుబట్టారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో శనివారం జరిగిన ఈ సమావేశానికి స్పీకర్‌తోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ లేచి పీఏసీ చైర్మన్ ఎంపికను ప్రస్తావించారు. తామడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి సమావేశాన్ని కొనసాగించాలని కోరారు. అయితే స్పీకర్ సహా, మంత్రి, మండలి చైర్మన్.. మౌనమే సమాధానం అన్నట్టు వ్యవహరించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం మీడియా పాయింట్ వద్ద వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటరీ వ్యవస్థలో పీఏసీ అత్యంత కీలకమైనదని అన్నారు. సభలో ప్రజల గొంతుకగా వ్యవహరించే ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం అనవాయితీగా వస్తున్నదని చెప్పారు. ఈ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ నియామకంపై అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని తెలిపారు. అసెంబ్లీ రూల్ 250 ప్రకారం పీఏసీ చైర్మన్‌ను ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలన్న నిబంధన ఉన్నదని గుర్తు చేశామని చెప్పారు.
పీఏసీ చైర్మన్ పదవి కోసం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పక్షాన తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఇద్దరు ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ పేర్లు ఇచ్చామని తెలిపారు. వారందరూ నామినేషన్ వేశారని చెప్పారు. అరికెపూడి గాంధీ నామినేషన్ వేశారా? హరీశ్‌రావు నామినేషన్ ఎటు పోయింది? అని స్పీకర్‌ను అడిగామన్నారు.
గాంధీ నామినేషన్ వేస్తే ఆరుగురు సభ్యులవుతారని, అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. తమ ప్రశ్నలకు స్పీకర్ సమాధానం ఇవ్వలేదని, మౌనంగా ఉండిపోయారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షమైన కాంగ్రెస్ సభ్యులకు పీఏసీ చైర్మన్ పదవిని ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంట్లో కూడా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్‌గా ఉన్నారని తెలిపారు.