హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థినులకు ఇచ్చిన ‘స్టేషన్‌ఘన్‌పూర్ డిక్లరేషన్’ను వెంటనే అమలుచేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మంగళవారం శాసనమండలి ఆవరణలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నిరసనను కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ.. విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడిస్తరు? అని ప్రశ్నించారు.
స్కూటీల హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను వంచించినట్టుగానే విద్యార్థులను మోసం చేశారని మండిపడ్డారు. ఇవ్వని హామీలను సైతం అమలుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. హామీలను అమలుచేయని కాంగ్రెస్ పార్టీ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలైందని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని, తులం బం గారం ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రూ.1.50 లక్షల కోట్ల అప్పు చేసిం డ్రు, హామీలను మాత్రం విస్మరించారని ధ్వజమెత్తారు. స్కూటీల హామీని నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంకగాంధీకి విద్యార్థినులు పోస్టుకార్డులు రాస్తున్నట్టు తెలిపారు.