హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై విచారణ జరుపాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సమాధానం చెప్పలేని ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేసింది. సోమవారం శాసనమండలి సమావేశం ప్రారంభమైన వెంటనే రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై విచారణకు సభా సంఘాన్ని వేయాలని సభ్యుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోకుండా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి రోజువారీ సభ నిర్వహణలో భాగంగా ప్రభుత్వానికి పద్దులు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఈ దశలో బీఆర్ఎస్ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం ఎదుట నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ‘తల్లిదండ్రుల సంరక్షణ బిల్లు’ను ప్రవేశపెట్టారు.
అనంతరం బిల్లు లక్ష్యాలను సభ్యుల నినాదాల మధ్యే వివరించారు. చైర్మన్ జోక్యం చేసుకొని సభ్యులు ఆందోళన విరమించి తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. అయినప్పటికీ నినాదాలు కొనసాగాయి. ఈ దశలో మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని, అయినప్పటికీ సభ్యులు డిమాండ్ చేయడం తగదని పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలతో మండిపడిన బీఆర్ఎస్ సభ్యులు.. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై సభా సంఘం వేయాలని, మంత్రి పొంగులేటిని మంత్రివర్గం నుంచి తొలగించాలని నినదించారు. సుమారు 45 నిమిషాలకు పైగా మండలి అట్టుడికింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు. సస్పెన్షన్‌కు గురైన సభ్యులు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. వారిని మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎమ్మెల్సీలను మూకుమ్మడిగా మండలి నుంచి సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సహజంగా మండలిలో విపక్ష సభ్యులు ఆందోళనలు చేసినప్పుడు, పదే పదే మంత్రుల సమాధానాలకు అడ్డుతగిలినప్పుడు సభ వాయిదా వేయడం జరిగేది. కానీ, ఇలా ఒక పార్టీకి చెందిన సభ్యులను సస్పెండ్ చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘శాసనమండలి పెద్దల సభ. ఈ సభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత సభ్యులపై ఉన్నది. పదే పదే నినాదాలు చేయడం, గొడవ చేయడం తగదు. ఇప్పటివరకు మండలిలో సభ్యులను సస్పెండ్ చేయలేదు. సభ సంప్రదాయాలను పాటించాలి’ అని సూచించారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అక్రమ దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మండ లి ప్రతిపక్ష నేత సిరికొండ ముధుసూదనాచారి పేర్కొన్నారు. మంత్రి అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెడితే ఆయనపై చర్యలు తీసుకోకుండా అందుకు విరుద్ధంగా.. ప్రశ్నించిన, అక్రమాలను లేవనెత్తిన సభ్యుల నోరు నొక్కుతుందని మండిపడ్డారు. తప్పులు ఎత్తిచూపిన వారిని సభ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన అక్రమాలు సక్రమం కావని పేర్కొన్నారు. సోమవారం బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ.. కొత్వాల్‌గూడలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ గడిచిన రెండుమూడేండ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి కట్టాల్సిన రాయితీలు చెల్లించకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు.
మంత్రి అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వానికి చెందాల్సిన సంపద, ఆస్తులను అక్రమంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచిస్తే అర్థం చేసుకోవాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఖరి చూస్తుంటే మైనింగ్ అక్రమాలు కేవలం పొంగులేటికి మాత్రమే పరిమితం కాలేదని, సీఎంకు కూడా ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉన్నందునే చర్యలు తీసుకోవడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. నీతీనిజాయితి ఉంటే మంత్రి పొంగులేటి అవినీతి, అక్రమాలకు పాల్పడకపోతే సభా సంఘాన్ని వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్‌పై విచారణకు సభా సంఘం వేసి, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేసే వరకు బీఆర్ఎస్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ):మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ దోపిడీని పకా ఆధారాలు, అధికారుల నోటీసులు సహా సభ ముందుంచామని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండలిలో బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్ అనంతరం మీడియా పాయింట్ వద్ద, ఆ తరువాత తెలంగాణభవన్‌లోనూ మీడియా తో మాట్లాడారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నిజాలు బయటపడుతాయనే భయంతో తమను సభ నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని దేశపతి విమర్శించారు.
అక్రమాలపై సాంకేతిక ఆధారాలున్నా మౌనమెందుకు? అని ప్రశ్నించారు. మైనింగ్ అధికారులు స్వయంగా 11,200 టన్నుల అక్రమ నిల్వలను పట్టుకుని షోకాజ్ నోటీసులు జారీ చేస్తే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. అక్రమాలు జరుగకపోతే సభా సంఘం వేయమంటే ఎందుకు భయం అని దేశపతి ప్రశ్నించారు. విచారణకు భయపడి సస్పెండ్ చేశారంటేనే మీరు తప్పు చేశారని పరోక్షంగా ఒప్పుకొన్నట్టు అని పేర్కొన్నారు.