Pat Cummins : సొంతగడ్డపై ప్రత్యర్థులకు వణుకు పుట్టించే ఆస్ట్రేలియా(Australia)ను బంగ్లాదేశ్ (Bangladesh) అలవోకగా ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన బంగ్లా చరిత్రాత్మక విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో ముందంజ వేసింది. స్వదేశంలో.. చిన్న జట్టు చేతిలో ఊహించని ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఏమాత్రం సంకోచించకుండా స్పందించాడు. అన్ని విభాగాల్లో తమకంటే బంగ్లాదేశ్ గొప్పగా ఆడిందని.. ఈ ఓటమి నుంచి తేరుకోవడం తమకు కష్టంగా ఉండనుందని కమిన్స్ అన్నాడు.
డార్విన్ టెస్టులో తొలి రోజు నుంచి ఆధిపత్యం చెలాయించిన బంగ్లాదేశ్ చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాపై మొట్టమొదటి టెస్టు విక్టరీతో సిరీస్‌లో ముందంజ వేసింది నజ్ముల్ హుసేన్ శాంటో సేన. ఊహించని పరాజయంపై ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ మ్యాచ్ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమకంటే బంగ్లాదేశ్ గొప్పగా ఆడిందని పేర్కొన్న ప్యాటీ.. అన్ని విభాగాల్లోనూ తాము విఫలమయ్యాని చెప్పాడు.
🎙️ Pat Cummins reflects on Australia’s loss to Bangladesh in Darwin pic.twitter.com/P8hM2MoUb7
— Cricinfo (@cricinfo) August 16, 2026
‘బంగ్లాదేశ్ ఆటగాళ్లు చాలా గొప్పగా ఆడారు. చెప్పలాంటే అన్ని విభాగాల్లోనూ మమ్మల్ని వెనక్కినెట్టారు. ఎంతో ఓపికగా, క్రమశిక్షణలో ఆడారు. ఈరోజు బంగ్లా స్పిన్నర్లు చాలా ప్రమాదకరంగా కనిపించారు. ఆ జట్టు పేసర్లు వికెట్లు తీశారు. బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఈ విజయానికి అర్హులు వాళ్లే. ఒకసారి వెనకబడ్డాక.. మళ్లీ పుంజుకోవడం మాకు కష్టమే’ అని కమిన్స్ తెలిపాడు.
తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహమూద్ ఆరు వికెట్లతో ఆసీస్ నడ్డి విరిచాడు. అనంతరం తంజిద్ హసన్ శతకంతో భారీ స్కోర్ కొట్టిన బంగ్లాదేశ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగింది. బ్యాటింగ్‌లో 65 పరుగులతో రాణించిన మెహిదీ హసన్ మిరాజ్.. ఐదు వికెట్లతో కంగారూల పతనాన్ని శాసించాడు. కామెరూన్ గ్రీన్ శతకం బాదినా.. ఆస్ట్రేలియా 284కే ఆలౌటైంది. అనంతరం.. స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది బంగ్లా. ఇరుజట్ల మధ్య కీలకమైన రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి జరుగనుంది.