తాండూరు రూరల్, జనవరి 23 : కాగ్నా వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకర్గ బీఆర్ఎస్ నాయకుడు ఉమాశంకర్, ఉపసర్పంచ్ అక్రమ్, గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. తాండూరు మండలం చంద్రవం చ సమీపంలోని కాగ్నా వాగు నుంచి నెల రోజులుగా నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ, టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని టిప్పర్ల ముందు ధర్నాకు దిగారు. తహసీల్దార్ తారాసింగ్, ఈఈ విజయ్‌కుమార్‌తోపాటు కాంట్రాక్టర్ వెంకట్రావు చేరుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు కోసం ఇసుక తీసుకెళ్తున్నామని వివరించగా..
బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఆన్లైన్ టెండర్ల ద్వారా ఇసుక రవాణా చేయాలని సూచించారు. ఒక్కో టిప్పర్‌లో 35 టన్నులకు పైగా ఇసుక నింపి తరలిస్తున్నారని పేర్కొన్నారు. పెద్దేముల్, ధారూర్, తదితర ప్రాంతాల్లో అక్రమ దందా చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ రసీదులు తీసుకువచ్చి ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తామంటే ఊరుకునేది లేదని సర్పంచ్ సుదర్శన్‌రెడ్డి, ఉప సర్పంచ్ అక్రమ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉమాశంకర్ స్పష్టంచేశారు.