హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కొర్రీ.. పేద విద్యార్థులకు వర్రీ.. విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. వెంటనే నిధులు విడుదల చేయా లి.. గ్యారెంటీలకు తిలోదకాలు..ప్రజలకు పంగనామాలు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు సోమవారం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలాగాటమాడుతున్నదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.12 వేల కోట్ల బకాయిలు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్సార్ తీసుకొచ్చిన స్కీమ్‌కు తూట్లు పొడుస్తున్నదని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డునపడే పరిస్థితి నెలకొన్నదని సిరికొండ ఆవేదన వ్యక్తంచేశారు. వారి తరఫున చట్టసభల్లో సర్కార్‌ను నిలదీస్తామని, అవసరమైతే క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.