హైదరాబాద్, మార్చి 15 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ శనివారం శాసనమండలిలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిషరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ స్ట్రెచర్ మీది నుంచి మార్చురీకే అని వ్యాఖ్యానించడం, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, 10 ఏండ్లు రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిన పాలనాధక్షుడైన కేసీఆర్ చావును కోరుకోవడమంటే తెలంగాణకు కీడును కోరుకోవడమేనని ఆక్షేపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన తర్వాతే గవర్నర్ ధన్యవాద తీర్మానంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులందరూ సభలో నిరసన తెలిపారు. ‘సీఎం మార్చురీ భాషను ఖండిద్దాం..సీఎం భాష తీరును మార్చుకోవాలి.. కేసీఆర్‌కు సీఎం క్షమాపణ చెప్పాలి.. జై తెలంగాణ..జైజై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో సీఎం రేవంత్ ప్రసంగించకుండానే కూర్చున్నారు. ఈ దశలో చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం సభా సంప్రదాయమని, సీఎం సమాధానం అనంతరం ఏవైనా అభ్యంతరాలుంటే వెల్లడించాలని, సీఎం ప్రసంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా బీఆర్ఎస్ సభ్యులు కేసీఆర్‌కు క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసంగించాలని పట్టుపట్టారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాల మధ్య పదేపదే మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ జోక్యం చేసుకుంటూ ఎక్కడో సీఎం మాట్లాడిన మాటలను సభలో ప్రస్తావించటం సమంజసం కాదని, కేవలం రాజకీయ ఉద్దేశంతోనే సీఎం ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే అసెంబ్లీతో దీనిపై సీఎం రేవంత్ వివరణ ఇచ్చారని పేర్కొన్నారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. దాదాపు అరగంటపాటు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి జోక్యం చేసుకొని సీఎం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు అనుమతిస్తానని చెప్పారు. కానీ ముందుగా ప్రతిపక్ష నేత మధుసూదనాచారికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. చైర్మన్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు మధుసూదనాచారి ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావును కోరుకున్న నాయకుడి ప్రసంగాన్ని తాము వినేది లేదని పేర్కొంటూ వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇవ్వడంతో మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదం పొందింది.