రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో కాంగ్రెస్ నాయకులు గూండాగిరితో బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడ్డారు. శాంతియుతంగా ఆందోళనచేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నా యకులు భరత్, శరత్, మరికొందరు దాడిచేశారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అడ్డుకునేందుకు యత్నించారు.
ఈ దాడిలో బీఆర్ఎస్ నాయకుడు గుగ్గిళ్ల భూమలింగం గాయపడగా.. అతడి చొక్కా చింపేసి, పిడిగుద్దులు కురిపించారు. అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూశారని, కాంగ్రెస్ నేతలకే వత్తాసు పలికారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.