BRS | తొర్రూరు, అక్టోబర్ 3: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపచేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కప్పదాటు వైఖరిని ఎండగడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేతృత్వంలో తొర్రూరులో శుక్రవారం భారీ ధర్నాకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలం కావడం, రుణమాఫీని పూర్తి స్థాయిలో అర్హులైన రైతులకు వర్తింప చేయకపోవడాన్ని నిరసిస్తూ తలపెట్టిన ధర్నాలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డితోపాటు పలువురు నేతలు ఈ ధర్నాలో పాల్గొననున్నట్టు మాజీ మంత్రి దయాకర్‌రావు తెలిపారు.
గురువారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహాక స మావేశంలో మాట్లాడుతూ.. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచేందుకు, రైతులకు ఇచ్చిన వాగ్ద్దానం మేరకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రుణమాఫీ అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తలపెట్టిన ధర్నాకు దగా పడ్డ రైతులంతా పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.