హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ‘అంగన్వాడీ సెల్ఫోన్ల టెండర్లలో అక్రమాలను ఆధారాలతో బయటపెడితే మంత్రి సీతక్క చెప్పుతెగుద్ది అని మాట్లాడటం సిగ్గుచేటు.. తప్పుచేయకుంటే అంత ఆవేశమెందుకు’ అంటూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం ములుగులో బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. 38,310 మొబైల్ఫోన్ల కోసం సెల్కాన్ కంపెనీకి రూ. 54 కోట్లు కట్టబెట్టింది ముమ్మాటికీ వాస్తవమని తెలిపారు. పబ్లిక్ డొమైన్లో పెట్టిన వివరాలతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించామని పేర్కొన్నారు. కానీ బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న సీతక్క ఇష్టారాజ్యంగా మాట్లాడటం దురదృష్టకరమని వాపోయారు. 5జీ కాలంలో 4జీ ఫోన్లను పంపిణీచేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, తప్పు జరుగలేదని భావిస్తే సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అంతేగానీ నోరుపారేసుకుంటే ఊరుకొనే ప్రసక్తిలేదని హెచ్చరించారు.
అంగన్వాడీ సెల్‌ఫోన్ టెండర్లలో అక్రమాలు జరిగింది ముమ్మాటికీ నిజమని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కానీ మంత్రి సీతక్క మాత్రం ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సెల్ఫోన్ల స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన మంత్రి అడ్డదిడ్డంగా మాట్లాడి తప్పించుకొనేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఉన్నత పదవిలో ఉన్న ఆమె చెప్పుతెగుద్ది అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆమె చెప్పుతో కొడితే బీఆర్ఎస్ ఆధారాలతో తిప్పికొడుతుందని తేల్చిచెప్పారు. తప్పుచేయలేదని భావిస్తే వెంటనే సీబీఐ విచారణకు సిద్ధంకావాలని డిమాండ్ చేశారు.