Deeksha Diwas | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లుచేసింది. ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యాయి. తెలంగాణభవన్‌లో దీక్షా దివస్ ఏర్పాట్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరిశీలించారు. శాసనమండలిలో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, దీక్షాదివస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, నాంపల్లి, ఖైరతాబాద్ నియోజకవర్గాల ఇన్చార్జీలు ఆనంద్‌గౌడ్, గోవర్ధన్‌రెడ్డి సహా పార్టీ సీనియర్ నేతలు ఏర్పాట్ల పరిశీలన స మయంలో కేటీఆర్ వెంట ఉన్నారు.
కాగా, శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మానకొండూరు నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. 11 గంటలకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. ఉదయం 11.30 గంటలకు దీక్షా దివస్ బహిరంగసభలో పాల్గొంటారు.
వరంగల్, నవంబర్ 28 : సబ్బండ జాతులను ఏకం చేసి మలిదశ తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చేలా నవంబర్ 29న కేసీఆర్ చేసిన దీక్షను చేపట్టారు. దీనికి గుర్తుగా వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఆవరణలో ఏకైక దీక్షాదివస్ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు, కార్పొరేటర్‌గా ఉన్న జోరిక రమేశ్ కౌన్సిల్ సమావేశంలో దీక్షా దివస్ గుర్తుగా బల్దియా ఆవరణలో పైలాన్ ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అప్పటి మేయర్ ప్రకాశ్‌రావు తీర్మానానికి ఆమోదం తెలిపి 10 లక్షలు కేటాయించారు.