హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తమను నిరాశకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే అంచనా వేశారని పార్టీ కీలక నేతలు పేర్కొంటున్నారు.
కేసీఆర్ ఫలితాలను ముందే ఊహించటం వల్లే ‘గెలిచినా, గెలవకపోయినా బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పక్షాన ఉంటది’ అని వ్యాఖ్యానించారని సదరు నేత తెలిపారు. ఈ క్రమంలోనే ‘దేవుడు ఇచ్చిన ఆయుష్షు ఉన్నంత వరకు, చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పనిచేస్త తప్ప, ఎట్టిపరిస్థితుల్లో విశ్రమించే ప్రసక్తేలేదు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తది. ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడుతది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ నేత ఉదహరిస్తున్నారు.
20 ఏండ్ల తర్వాత..
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఐదుసార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో ఈ ఎన్నికల్లో మాత్రమే లోక్‌సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఆవిర్భవించిన మూడేండ్లకు (2004) వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకొన్నది. పార్టీ అధినేత కేసీఆర్, ఆలె నరేంద్ర, బోయినపల్లి వినోద్‌కుమార్, రవీంద్రనాయక్, మధుసూదన్‌రెడ్డి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవటం, యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని చేర్చటం, రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ఏర్పాటుకు అధికారిక ప్రకటన చేయించటమే పదేండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పునాది పడిందనే విషయం తెలిసిందే. ఈ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు (కేసీఆర్, విజయశాంతి) ఎంపీలుగా గెలిచినా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో 9 సీట్లు సాధించి, ఇప్పుడు మాత్రం ఒక్కసీటును కూడా సాధించకపోవటం గమనార్హం.