BRS | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో దూకుడు పెంచింది. ఇప్పటికే 20 లక్షల మంది పదాధికారులను కలిగిన బీఆర్ఎస్.. ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల మందితో ఆ రాష్ట్రంలో అనతికాలంలోనే అత్యధిక పదాధికారులున్న పార్టీగా అవతరించనున్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదానికి మహారాష్ట్రలో విశేష ప్రజాదరణ లభిస్తున్నది.
మహారాష్ట్రలోనూ తెలంగాణ మాడల్ అమలు కావాలంటే బీఆర్ఎస్ త ప్ప ఇతర పార్టీలకు సాధ్యం కాదని మహారాష్ట్ర ప్రజలు విశ్వసిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన ఉభయ వర్గాలు, ఆప్ వంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్కు క్యూ కడుతున్నారు. రాజకీయ నేతలే కాకుండా మహారాష్ట్రలో ప్రజాదరణ ఉన్న సామాజిక సేవా సంస్థలు, షెత్కరీ సంఘటన్లు బీఆర్ఎస్లో విలీనం అవుతున్నాయి. మహారాష్ట్రలో వస్తున్న ప్రజాదరణ, వారి డిమాండ్ మేరకు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. త్వరలో సోలాపూర్‌లో భారీబహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది.
గత ఆగస్టు 30న ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సోలాపూర్‌లో పద్మశాలీయులు అత్యంత వైభవంగా నిర్వహించే మార్కండేయ రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం సోలాపూర్‌లో నిర్వహించే భారీ బహిరంగసభ కోసం బాల్కోట్, ఈద్గా మైదానాలను పరిశీలించారు. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాక, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో చర్చించి బహిరంగ సభ తేదీలను ఖరారు చేస్తామని సోలాపూర్ పార్టీ నాయకత్వం తెలిపింది.
భారీ సభలతో మహారాష్ట్రలో కొత్త ట్రెండ్
‘అడుగుపడటమే పులిపంజా విసిరినట్టు ఉండాలె..’ అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాందేడ్, కంధార్-లోహ, ఔరంగాబాద్, సాంగ్లీ సభలతో మహారాష్ట్ర రాజకీయాలను షేక్చేసింది. ప్రజాసమస్యల పరిష్కారానికి ఆచరణ సాధ్యమైన ప్రత్యామ్నాయ కార్యాచరణను ప్రజల ముందు పెట్టింది. మహారాష్ట్రలోని సహజ, మానవ వనరుల సంపదను వినియోగించుకునే ప్రణాళికను సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్న తీరు సామాన్యులను సైతం ఆలోచింపజేస్తున్నది. అక్కడి రాజకీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థం చేస్తున్నది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతోపాటు మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ ఆవశ్యకతను కేసీఆర్ మహారాష్ట్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
36 జిల్లాల్లో అధినేత సభలకు ప్రణాళికలు
ఈ నెలాఖరులోగా పార్టీ పదాధికారుల నియామక ప్రక్రియ పూర్తి కాగానే అన్ని జిల్లాల్లోనూ సభలు నిర్వహించాలని, ఆ సభలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలని మహారాష్ట్రలోని 36 జిల్లాల సమన్వయకర్తలు, సహాయ సమన్వయకర్తలు ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలపై ఒత్తిడి తెస్తున్నారు. ఫలితంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కే వంశీధర్‌రావు, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్, మాజీ ఎమ్మెల్యేలు శంకరన్నదొంగ్డే, బాబురావ్రాథోడ్, భగీరథ్బాల్కేతోపాటు కొంకణ్, నాసిక్, ఔరంగాబాద్, అమరావతి, పుణె, నాగపూర్ రీజినల్ కో-ఆర్డినేటర్లు సహా పలువురు ముఖ్యనేతలు ఇటీవల సీఎం కేసీఆర్‌తో ఇదే విషయమై చర్చించినట్టు సమాచారం.
288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, సహాయ సమన్వయకర్తలు కోరుతున్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకవేళ అదే నిజమైతే త్వరలో నిర్వహించే భారీ బహిరంగ సభ అనంతరం సమయం, సందర్భాన్ని బట్టి నెల నుంచి 40 రోజులపాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహారాష్ట్రలో పర్యటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
మహారాష్ట్రకు తెలంగాణే మాడల్ నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్
తెలంగాణ మాడల్ కోసం మహారాష్ట్ర ఎదురుచూస్తున్నదని రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకే మహారాష్ట్ర రాత మార్చే దార్శనికత ఉన్నదని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. గురువారం మహారాష్ట్రలోని అంబాజోగై జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని, అర్లి అసెంబ్లీ ని యోజకవర్గంలో తెలంగాణ మాడల్ పథకాలు వివరించే ప్రచార రథాన్ని బీ ఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, పార్టీ నేత, న్యాయవాది మాధవ్జాదవ్తో కలిసి ఆ యన ప్రారంభించారు. అంతకుముం దు నియోజకవర్గ కేంద్రమైన అర్లిలో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.