హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బీఆర్ఎస్ఎల్పీ ఫిర్యాదు చేసింది. బుధవారం శాసనసభలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై నిరాధార ఆరోపణలు చేయడమే కాకుండా సభా సంప్రదాయాలకు విరుద్ధంగా అస భ్య పదజాలం వినియోగించారని, ఈ విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం స్పీకర్‌ను కోరింది. సభ జరుగుతున్నప్పుడు స్పీకర్ అనుమతి తీసుకోకుండా, నిరాధార ఆరోపణలు చేయడం ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డి, మాణిక్‌రావు, లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, విజయుడు, డాక్టర్ సంజయ్ ఉన్నారు.
హైదరాబాద్, డిసెంబర్19 (నమస్తే తెలంగాణ): రైతులకు పంట పెట్టుబడి సాయంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని అందజేసింది. యాసంగి సాగు మొదలైందని, రుణమాఫీ కాక, పంట పెట్టుబడి డబ్బులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎకరాకు రూ. 15వేలు అందించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీతోపాటు, బోనస్ తదితర అంశాలపై చర్చించాలని వాయిదా తీర్మా నం అందజేశారు. రైతులకు సంబంధించిన అంశాలపై చర్చించాలని పచ్చకండువాలతో బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే జీవో 317పై చర్చించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం అందజేశారు.