నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 30: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. పదేండ్లు రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దిన అపర భగీరథుడిపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్‌ను ‘సిట్’ పేరుతో భయపెట్టిస్తే భయపడేవారు కాదని స్పష్టం చేశారు. సిట్ నోటీసులను నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో జరిగిన నిరసనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లాలోని పలుచోట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనంచేశారు. కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలోనూ గ్రామస్థులు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
గ్రేటర్ పరిధిలోనూ..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. సికింద్రాబాద్ పరిధి అడ్డగుట్ట చౌరస్తాలో డివిజన్ కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో, మియాపూర్‌లోని ఆల్విన్ కాల నీ జంక్షన్ వద్ద శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వాలా హరీశ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగద్గిరిగుట్ట లాస్ట్ బస్‌స్టాపులో ఆందోళనకు దిగిన కార్పొరేటర్ జగన్, సూరారం అధ్యక్షుడు సురేశ్‌రెడ్డితోపాటు పలువురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.