Rythu Discom | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన రైతు డిస్కమ్ పై విద్యుత్ రంగ నిపుణులు రైతు సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్న క్రమంలో దానికి విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతిస్తుందా? కొత్త డిస్కంకు లైసెన్స్ దక్కుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ డిస్కమ్ ఏర్పాటుపై ఇప్పటికే రైతు సంఘాల నేతలు ఈఆర్సీకి లిఖితపూర్వక అభ్యంతరాలను సమర్పించారు. రైతు డిస్కమ్ దాఖలు చేసిన లైసెన్స్ పిటిషన్‌పై ఈఆర్సీ శుక్రవారం బహిరంగ విచారణ జరుపనున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈఆర్సీ ముందు హాజరై, తమ వాదనలను వినిపించనున్నారు. రైతులు, రైతు సంఘం నేతలు, విద్యుత్తు రిటైర్డ్ ఇంజినీర్లు, నిపుణులు సైతం తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.
సగటు బిల్లింగ్ రేటు.. సగటు సేవా వ్యయం.. మధ్య వ్యత్యాసంతోనే డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితి క్షీణించిందని రైతు డిస్కమ్ తన లైసెన్స్ పిటిషన్లో వాదించింది. ఒకరకంగా డిస్కం ఆర్థిక పరిస్థితికి ఈఆర్సీ కారణమన్నట్టు రైతు డిస్కమ్ తన పిటిషన్లో వాదించిందని విద్యుత్తురంగ నిపుణలుంటున్నారు. దీనిని ఆరోపణగానే పరిగణించాలని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు అభిప్రాయపడ్డారు. ఏటా టారిఫ్‌లు, సేవా వ్య యాన్ని ఈఆర్సీయే ఖరారు చేస్తున్నది కాబట్టి డిస్కంల ఆర్థిక పరిస్థితి క్షీణించేందుకు ఈఆర్సీదే బాధ్యత అని రైతు డిస్కమ్ పరోక్షంగా వాదిస్తున్నదని తెలిపారు. డిస్కమ్‌లు, ప్రభు త్వం వైఫల్యాన్ని ఈఆర్సీపై మోపుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఈఆర్సీ గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు ఈఆర్సీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇంధన సర్‌చార్జీ రూపంలో నెలకు ఒక యూనిట్‌కు రూ.0.30 వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించింది. దీనిని డిస్కంలు వసూలు చేసుకోవడంలేదు. ఇంధన సర్‌చార్జీకి అనుమతించినా వసూలు చేసుకోకపోవడం ఈఆర్సీ ఆదేశాలను ఉల్లంఘించడమేనని వేణుగోపాలరావు చెప్తున్నారు.
వ్యవసాయ విద్యుత్తు వినియోగాన్ని అంచనా వేసేందుకు ఈఆర్సీ అనుమతించలేదన్నది డిస్కంల వాదన. డిస్కంలు దీనిని ఎందుకు సవాల్ చేయలేదు. కమిషన్ తిరస్కరించిన వాటిని బకాయిలుగా పరిగణించి ఎందుకు క్లెయిమ్ చేయలేదు. అప్పిలేట్ అథారిటీ ముందు ఎందుకు సవాల్ చేయలేదని విద్యుత్తురంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రైతు డిస్కం ఏర్పాటు ద్వారా ప్రకటిస్తున్న ప్రయోజనాలేవీ వాస్తవ సమస్యలకు పరిష్కారంకావని వారు చెప్తున్నారు. ప్రభుత్వం బకాయిలను చెల్లించడం, ఎనర్జీ డిటింగ్లో పారదర్శకత, సమయానికి ట్రూ అప్ వసూళ్ల ద్వారా డిస్కంల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని సూచిస్తున్నారు. కొత్త డిస్కం ఏర్పాటు కన్నా.. ఇప్పుడున్న డిస్కంలను సంస్కరించాలని కోరుతున్నారు. రైతు డిస్కంతో రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు రాబోతున్నాయని, ప్రజలు, వినియోగదారుల శ్రేయస్సు కోసం ఈ డిస్కం పిటిషన్‌ను ఈఆర్సీ తిరస్కరించాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ కోరారు.