హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ‘మైనంపల్లి హన్మంతరావు తస్మాత్ జాగ్రత్త.. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు మానుకో. బీఆర్ఎస్ చేతిలో 50 వేల మెజారిటీతో చిత్తుచిత్తుగా ఓడిపోయిన నీకు కేటీఆర్‌ను విమర్శించే అర్హత ఎక్కడిది? మతిస్థిమితం కోల్పోయావా.. గతంలో కేటీఆర్ కాళ్లు పట్టుకున్నది మరిచిపోయావా? నీ పిట్ట బెదిరింపులకు ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన బీఆర్ఎస్ బెదరబోదు’ అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వేలాది పరిశ్రమలు తెచ్చి, లక్షలమంది యువతకు ఉపాధి కల్పించిన కేటీఆర్‌పై ఇష్టారాజ్యంగా మాట్లాడడాన్ని ఖండించారు. వెంటనే అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే మరోసారి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌లో విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్టీ నేతలు నందికంటి శ్రీధర్, క్రిశాంక్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
కేటీఆర్‌పై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ‘సర్’, సభ్యత్వ నమోదుపై నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. రోజురోజుకూ బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి అధికార కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ నేతలు పాల్పడుతున్న స్కామ్‌లు, సర్కార్ వైఫల్యాలను ప్రజల ముందుంచుతున్నామని స్పష్టంచేశారు. మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్, కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.
‘ఆయనకు బీఆర్ఎస్ రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించింది. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. హైదరాబాద్ పార్టీ అధ్యక్ష పదవినీ కట్టబెట్టింది’ అని గుర్తుచేశారు. కేసీఆర్ రాజకీయ పునర్జన్మనిచ్చారని చెప్పారు. గతంలో కేటీఆర్‌ను దేవుడిగా భావించి కాళ్లు పట్టుకున్న మైనంపల్లి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగడం విడ్డూరమని ధ్వజమెత్తారు. కేటీఆర్ నాయకత్వంలోనే నగరంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించిందని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా ఆయన పోరాటం ఆపడం లేదని, రేవంత్‌కు కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతగావడంలేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలు మరచి అక్రమ కేసులు పెట్టడం, నోటికొచ్చినట్టు తిట్టడం మైనంపల్లికి అలవాటైందని మండిపడ్డారు. మరో రెండున్నరేండ్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటదనే విషయాన్ని మైనంపల్లి గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరిట కంటోన్మెంట్లో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మైనంపల్లి అనుచరులు యత్నిస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. మైనంపల్లి హీరో కాదని, ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్లో ఎవరూ భయపడబోరని తేల్చిచెప్పారు. ఎస్బీఐ భూముల వ్యవహారంలో కేటీఆర్ పాత్ర ఉన్నదని నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. కేటీఆర్‌పై దుష్ప్రచారం చేయడం, కేసుల పేరిట వేధించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటైందని విమర్శించారు. 2014లో మూడు పార్టీలు మారిన ఘనత హన్మంతరావుకే దక్కిందని ఎద్దేవాచేశారు. ఆయన ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్‌లో ప్రాధాన్యం దక్కదని స్పష్టంచేశారు. మైనంపల్లి పిచ్చి మాటలు కాదు.. ఎక్కడికి రావాలనుకుంటున్నారు సమయం, స్థలం చెప్పండి.. చర్చించేందుకు సిద్ధమని పునరుద్ఘాటించారు. అంతేగాని ఆయన రౌడీ చేష్టలకు భయపడబోమని స్పష్టంచేశారు.
కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మైనంపల్లి ప్రగల్భాలకు దిగుతున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ మండిపడ్డారు. మైనంపల్లి నీకు దమ్ముంటే, ప్రజలపై ప్రేమ ఉంటే ప్రభుత్వంతో పోరాడి, సీఎంను మెప్పించి మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు తీసుకురావాలని హితవు పలికారు. కేటీఆర్‌తో వ్యక్తిగత ఘర్షణ వల్ల ప్రయోజనమేమి ఉండదని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత విద్వేషాలకు తావులేదని చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులను మైనంపల్లి తక్కువగా అంచనా వేస్తున్నారని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దమ్ముంటే కేటీఆర్‌తో పోటీపడి హైదరాబాద్‌ను ఆయనకంటే ఎక్కువగా అభివృద్ధి చేసి చూపాలని సవాల్ విసిరారు.
కేసీఆర్ పాలన బాగున్నదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి చెప్పారు. ఇది ఓర్వలేని కాంగ్రెస్ నేతలు కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. 25 ఏండ్లు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన మైనంపల్లి, ఇప్పుడు కాంగ్రెస్ ఐక్యత గురించి మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ మెప్పు కోసం, పదవుల కోసం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోసారి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊర్కొనేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో మైనంపల్లి పాత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసని దెప్పిపొడిచారు. మెదక్ నియోజకవర్గ ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే స్థానిక ఎమ్మెల్యే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో 11 చెరువులు తెగిపోయినా స్పందించని ఎమ్మెల్యే, రెండు స్పీడ్‌బ్రేకర్లు వేసి వందలాది రీల్స్ చేసుకుంటున్నారని చురకలంటించారు. మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు.