హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ప్రభు త్వం కేవలం 16,978 ఉద్యోగాలు మాత్ర మే ఇచ్చినట్టు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిందని, కానీ నల్లగొండ సభలో మాత్రం 70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం మాట్లాడారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అశోక్‌నగర్ లైబ్రెరీకి వచ్చి నిరుద్యోగులతో చర్చించాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ తన రాజకీయ క్రీడ కోసం నిరుద్యోగులను పావులుగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కా దని, నిర్వాసితులను రోడ్డున పడేయ డాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టంచేశారు. మూసీ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. నల్లగొండ సభలో తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను రేవంత్‌రెడ్డి అవమానించారని, ఉద్యమకారుల గురించి మాట్లాడే హకు ఆయనకు లేదని పేర్కొన్నారు.