హైదరాబాద్, జూన్ 28 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో చేరుకొని లోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క సుమన్, తాతా మధు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పావనీగౌడ్ తదితరులు అడ్డుకున్నారు. విషయం తెలిసి పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరకొని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోనికి ఎలా వస్తారని ప్రశ్నించడంతో కొద్దిసేపు నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. వారెంట్ లేకుండా లోనికి వెళ్లవద్దని పార్టీ లీగల్ టీం సభ్యులు సైతం అభ్యంతరం చెప్పారు. నాటకీయ పరిణామాల మధ్య గేటు బయట బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆయనను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల అక్రమ కేసులకు భయపడబోమని గెల్లు శ్రీనివాస్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ నేతలపై, కేటీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్న మీడియా, సోషల్ మీడియాను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అరెస్ట్‌కు ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, ఆయన కుటుంబసభ్యులపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్న మహా న్యూస్ చానల్ యాజమాన్యాన్ని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినవారిని వదిలిపెట్టి బీఆర్ఎస్ నేతలపైనే కక్ష సాధించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిఒక్కరికీ తల్లులు, కుటుంబసభ్యులు ఉంటారనే సోయిలేకుండా కేటీఆర్ పరువు తీయాలని మహాన్యూస్ చానల్ ప్రసారాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చానల్ కార్యాలయం వద్ద చిన్న గ్లాస్ అద్దాలు పగిలిపోతే ఇక్కడ రేవంత్‌రెడ్డి, అక్కడ చంద్రబాబు హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. ఓ సెక్షన్ మీడియా పనిగట్టుకొని కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్యనేతలపై బురదజల్లేందుకు యత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహాన్యూస్ చానల్‌పై బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.